– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన
– అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీం ‘తొలి ముద్ద’ ప్రారంభం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: అంగన్‌వాడీ పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభోత్సవానికి ఒక మంచి నేపథ్యం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో దేశంలో నిరక్షరాస్యతను తగ్గించేందుకు, వ్యవసాయ అభివృద్ధికి తొలి ప్రధాని ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం ఫుడ్ సెక్యూరిటీ ఉంది.. కానీ న్యూట్రిషన్ ఫుడ్ అందడం లేదు. అందుకే బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్ స్కీం ‘తొలి ముద్ద’ను అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంత మంచి ప్రణాళికలు చేసినా అమలు చేయాల్సింది అంగన్‌వాడీ టీచర్లు మాత్రమేనన్నారు. అందుకే ప్రభుత్వం మీపై గురుతర బాధ్యత పెట్టిందంటూ చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకుని వారికి పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా భావిస్తోందని, మీ సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని, ఏ మాత్రం ఆర్ధిక వెసులుబాటు కలిగినా ముందుగా మీ సమస్యలనే పరిష్కరిస్తామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండటానికి వీల్లేదని, సొంత భవనాలు నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందితేనే వారిలో మానసిక ఎదుగుదల ఉంటుందని, పోష్టికాహారం లేకపోవడం వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని, భవిష్యత్తులో అవే అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకే ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్ వంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, చైల్డ్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ సీతాదయాకర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంగన్వాడీ చిన్నారులకు ఇకనుంచి రెడీ టు కుక్ ఫుడ్ (ఉప్మా, కిచిడీ మిక్స్)ను బ్రేక్ ఫాస్ట్‌గా అందించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ వర్కర్స్‌కు మొబైల్ ఫోన్‌లను సీఎం పంపిణీ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





