– ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్రం సంసిద్ధం
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. భారతదేశం రిఫైనరీ విషయంలో నాలుగో స్థానం, ఎగుమతుల విషయంలో ఐదో స్థానంలో ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ పశ్చిమాసియాలోని పరిణామాలతో దేశానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదని, దేశంలో పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం వంటి పెట్రోలియం ఉత్పత్తులు, క్రూడ్ ఆయిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపారు. నరేంద్రమోదీ అధికారం చేపట్టిననాటి నుంచీ దేశంలో ఇంధన భద్రతకు ప్రాధాన్యత ఇస్తోందని, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ (మంగళూరు, పాదూర్, విశాఖపట్టణంలోని వ్యూహాత్మక ఇంధన నిల్వలు) పెంచుకోవడంతోపాటు దేశీయంగా చమురు ఉత్పత్తి, ఇథనాల్ బ్లెండింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. దీని కారణంగా కొన్నేళ్లుగా దేశంలో ప్రజలకు పెట్రోల్ ఉత్పత్తులు అందుబాటులో ఉంచడంతోపాటు అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా దేశీయంగా ధరలు పెరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోందని వివరించారు. గతంలో మనంగల్ఫ్ దేశాల నుంచి పెద్దమొత్తంలో చమురును దిగుమతి చేసుకునే పరిస్థితులుండేవి.. కానీ కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వివిధ దేశాల నుంచి చమురు కొనుగోలుపై దృష్టిసారించిందని, దీని కారణంగా గల్ఫ్, ఇరాన్ మధ్యలో ఉన్న వివాదాస్పద హోర్ముజ్ జలసంధి నుంచి కాÅ£ వేర్వేరు రూట్లలో మన దేశ ఇంధన సంస్థలు చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయని తెలిపారు. అందువల్ల పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో భారతీయులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. దేశీయ అవసరాలÅ£నుగుణంగా తగినంత పెట్రోల్ ఉత్పత్తుల లభ్యత ఉందని, అవసరమైన మేర దిగుమతి చేసుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశ ఎగుమతులు, దిగుమతులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు విదేశీ వ్యవహారాలు, షిప్పింగ్-పోర్ట్స్, పెట్రోలియం, కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (సీబీడీటీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో కలిసిన వివిధ మంత్రిత్వ శాఖల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. అంతేకాక పెట్రోలియం మంత్రిత్వ శాఖ 24/7 కంట్రోల్ రూం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తోందని, వినియోగదారుల ప్రయోజనాలు కాపాడే విషయంలో ప్రభుత్వం రాజీపడబోదని, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరానికి తగిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



