– మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26ః రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రెడిటేషన్ మార్గదర్శకాలు వృత్తిపరమైన జర్నలిస్టులను నష్టపర్చవని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సంక్షేమ చర్యలు ఎలాంటి వివక్షలేకుండా అందరికీ వర్తించడంతోపాటు ఇంకా మెరుగైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు యోచిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వపు అక్రెడిటేషన్ ఉత్తర్వులు ఉర్దూ జర్నలిస్టుల పట్ల అనుసరించిన వివక్షను, చిన్న పత్రికల పట్ల చూపిన చిన్న చూపును హైకోర్టు కొట్టివేసిన అంశాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్త జీవోలో వాటిని మార్పు చేసిన విషయాన్ని వెల్లడించారు. నూతన జీవోపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా అవాస్తవాలను వెల్లడిస్తూ, వక్రీకరిస్తూ సంక్షేమ చర్యలు విలేకరులకు మాత్రమే వర్తిస్తాయని చెబుతుండడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. వృత్తిపరమైన జర్నలిస్టులందరికీ ఇవి వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఈ విషయాలపై అవసరమైతే వివరణ కోరవచ్చని సూచించారు. జర్నలిస్టుల సంక్షేమ చర్యల పట్ల ముఖ్యమంత్రితో, సమాచార శాఖ మంత్రితో మాట్లాడడానికి అవకాశాలు ఎలాగూ ఉంటాయన్నారు. ఇందుకు విరుద్ధంగా ఓ రాజకీయ ఎత్తుగడతో కొన్ని శక్తులు ఆందోళన చేయాలని తలపెట్టడం అత్యంత విచారకరమన్నారు. జర్నలిస్టుల పట్ల, వారి సమస్యల పట్ల రేవంత్ రెడ్డి నాయకత్వాన ఉన్న ప్రజా ప్రభుత్వం సానుకూల పరిష్కారానికి వెళ్తుంది తప్ప గత ప్రభుత్వం మాదిరి వివక్ష చూపే అవకాశమే లేదన్నారు. నూతన జీవోపై పనిగట్టుకొని కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని విశ్వసించరాదని వర్కింగ్ జర్నలిస్టులకు శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





