– కమర్షియల్ సిలిండర్లలో కొంత లోటు
– సామాజిక మాధ్యామాల్లో దుష్ప్రచారం
– ఎల్పీజి డిస్ట్రిబ్యూటర్స్‌తో మంత్రి ఉత్తమ్ సమీక్ష
-ప్రజలు సంయమనంతో ఉండాలని సూచన
హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి14: తెలంగాణలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, కేవలం కమర్షియల్ సిలిండర్ల విషయంలోనే కొంత కొరత ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంగీకరించారు. ఈ మేరకు ఆయన ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత మాత్రమే ఉందని చెప్పారు. అయినా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అవసరం లేకున్నా ముందస్తుగా గ్యాస్ బుక్ చేసుకోవద్దని ఉత్తమ్ సూచించారు. కావాలని గ్యాస్ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎల్పీజీ ఆయిల్ సరఫరా సంస్థలతో సమీ క్షించిన మంత్రి ఉత్తమ్..’ ప్రస్తుత పరిస్థితులపై నిన్న అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాం. రాష్ట్రంలో 810 మంది ఎల్పీజీ డిస్టిబ్యూటర్‌లు ఉన్నారు. 1.3 కోట్ల గృహ వినియోగదారులు ఉన్నారు. 7.5 లక్షల కమర్షియల్ కన్జుమర్స్ ఉన్నారు. నెలకు యావరేజ్ 60 లక్షల సిలిండర్లు డొమెస్టిక్ వాడుతున్నారు. కమర్షియల్ సిలిండర్ విషయంలోనే కొరత ఏర్పడుతోంది. డొమస్టిక్ కన్జుమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఎలాంటి కొరత లేదు. ఆందోళనతో ముందస్తుగా అవసరం లేకున్నా గ్యాస్ బుక్ చేసుకుంటున్నారు. గృహ అవసర సిలిండర్లకు కొరత లేదు. కమర్షియల్ సిలిండర్లను కేంద్రం 20 శాతం సప్లై చేస్తోందన్నారు. కమర్షియల్ సిలిండర్ల విషయంలో కేంద్రానికి లేఖ రాశాం. ప్రతి రోజు 2.15 లక్షల ఎల్పీజీ డొమాస్టిక్ సిలిండర్లు సప్లై చేస్తారు. నిన్న మొన్న 2.3 లక్షలు సప్లై చేశారు. కమర్షియల్ సిలిండర్లు రోజుకు 23 వేలు సప్లై చేసే వాళ్లు. కానీ ప్రస్తుతం 6200 సిలిండర్లు మాత్రమే ఇస్తున్నారు. స్కూల్స్, కాలేజెస్, సెంటర్, స్టేట్ గవర్నమెంట్ సంస్థలకు కమర్షియల్ సిలిండర్లు విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నాం. సివిల్ సప్లై భవన్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని. ఎవరైన కృత్రిమంగా గ్యాస్ కొరత సృష్టించినా..బ్లాక్ మార్కెట్ చేసినా హెల్ఫ్ లైన్ 180042500344 కు కాల్ చేయొచ్చని’ మంత్రి ఉత్తమ్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1.3 కోట్ల మంది యాక్టివ్ గృహ వినియోగదారులు ఉన్నారని, వారికి సరిపడా సిలిండర్లను ఆయిల్ కంపెనీలు అందిస్తున్నాయని మంత్రి తెలిపారు. గతంలో రోజుకు సగటున 2.15 లక్షల సిలిండర్లు సరఫరా అయ్యేవని, ప్రస్తుత డిమాండ్‌ను బట్టి దానిని 2.3 లక్షలకు పెంచినట్లు ఆయన వెల్లడించారు. గ్యాస్ కొరత ఉందన్న ఆందోళనతో వినియోగదారులు అనవసరంగా ఓవర్ బుకింగ్ చేసి సిస్టమ్‌ను ఓవర్‌లోడ్ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలు వాడే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో మాత్రం తగ్గుదల ఉన్న మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశిరచిన కొత్త మార్గదర్శకాల వల్ల గతంలో ఉన్న సరఫరాలో కేవలం 20 శాతం మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉందని ఆయన వివరించారు. గతంలో రోజుకు 23,000 కమర్షియల్ సిలిండర్లు సరఫరా అయ్యే చోట, ఇప్పుడు కేవలం 6,200 మాత్రమే వస్తున్నాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని ఆయన హా ఇచ్చారు. రాష్ట్రంలో గ్యాస్ పంపిణీ సక్రమంగా జరిగేలా చూడటంతో పాటు, అక్రమ నిల్వలను అరికట్టేందుకు రాష్ట్ర , జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. గృహ అవసరాల సిలిండర్లు పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మొత్తానికి, సామాన్యుడి వంటింట్లో మంట ఆరిపోకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని ఆయన భరోసా ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం : దిల్లీలో కట్టెల పొయ్యిలకు అనుమతి
న్యూదిల్లీ : దేశ రాజధాని దిల్లీలో పెరుగుతున్న గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా దిల్లీలో కట్టెల పొయ్యిల వాడకంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా క్టటెల పొయ్యిల వాడకానికి అధికారికంగా అనుమతి నిచ్చింది. దిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించే ఉద్దేశంతో గతంలో క్టటెల పొయ్యిలు, బొగ్గు వాడకంపై కఠినమైన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం నెలకొన్న గ్యాస్ కొరత కారణంగా సామాన్యులు పడుతున్న ఇబ్బందులను గమనించిన కేంద్రం, ఈ నిబంధనలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎల్‌పీజీ లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు వంట కోసం ఇబ్బంది పడకుండా ఈ వెసులుబాటు కల్పించారు. గ్యాస్ సంక్షోభం నుంచి ఉపశమనం పొందే వరకు ఈ అనుమతి వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. కట్టెల పొయ్యిలకు అనుమతి ఇచ్చినప్పటికీ, కాలుష్యం మరీ పెరగకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. వీలైనంత వరకు పొగ తక్కువగా వచ్చే పద్ధతులను పాటించాలని కోరింది. కేవలం నివాస అవసరాలకు మాత్రమే ఈ అనుమతి ఉంటుంది. బహిరంగంగా పెద్ద ఎత్తున కాల్చడంపై ఆంక్షలు కొనసాగుతాయి. కేంద్రం నిర్ణయం పట్ల దిల్లీలోని మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ధరలు పెరగడం, పైగా కొరత ఉండటంతో క్టటెల పొయ్యిలు ఇప్పుడు పెద్ద ఊరటనిస్తాయని భావిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.