– ఆందోళన వద్దు.. మీతో నేనున్నా
– డెస్క్ జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి హామీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: అక్రిడిటేషన్ కార్డులకు, మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వపరంగా అక్రిడిటేషన్ కార్డుదారులకు వర్తించే ప్రతీ ప్రయోజనం మీడియా కార్డుదారులకు కూడా వర్తిస్తుందని, ఈ విషయంలో డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, జీవో 252లో మార్పులు చేసి లిఖితపూర్వకంగా ఇస్తామని హామీ ఇచ్చారు. సచివాలయంలో తనను మంగళవారం కలిసిన టీడబ్ల్యుజేఎఫ్, డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులతో మంత్రి వివిధ అంశాలపై చర్చించి వారి సందేహాలను తీనివృత్తి చేశారు. కొంతమంది అపోహలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని అన్నారు. కార్డుల జారీలో ఎలాంటి పక్షపాతం లేదు.. మీరెవరూ ఆందోళన చెందొద్దు.. మీతో నేనున్నాను.. రెండుగా చూడాలన్న ఆలోచన కాదు.. ప్రభుత్వపరంగా అన్ని సంక్షేమ పథóకాలనూ వర్తింపచేస్తాం. అర్హులైన, నిజమైన జర్నలిస్టులకు మేలు చేయాలన్న సంకల్పం, సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయం ఇది అని చెప్పారు. రాష్ట్రంలో మినహా దేశంలో ఇంత పెద్దమొత్తంలో అక్రిడిటేషన్ కార్డులు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే రాష్ట్రంలోని అన్ని జర్నలిస్టు సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశానికి డెస్క్ జర్నలిస్టులను కూడా ఆహ్వానిస్తామ, అందరి అభిప్రాయాలు, సలహాలను సూచనలు తీసుకుని మరింత ప్రయోజనం చేకూరే విధంగా జీవో 252లో మార్పులు చేర్పులు చేస్తామని హామీ ఇచ్చారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు బి.రాజశేఖర్, గండ్ర నవీన్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన వారిలో ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉపేందర్, మస్తాన్, నాయకులు నిస్సార్, విజయ, రాజారాం, స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు కృష్ణ, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



