– బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత లేదు
– బ్లాక్ చేస్తే ఉపేక్షించబోం
– సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతోనే ఈ దుస్థితి
– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ
– కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మంత్రి ఉత్తమ్ వీసీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించి వారిని గందరగోళంలో పడేసేలా జరుగుతున్న ప్రచారంపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై వినియోగదారులు గందరగోళం చెందుతున్న క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎల్పీజీ గ్యాస్ సరఫరా విషయంలో ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని, గృహ వినియోగదారులకు సరిపడ సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. గ్యాస్ కొరత సృష్టించేందుకు సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. ఇలాంటి గందరగోళం ఏర్పడినందునే రోజు వారీగా 72% బుకింగ్స్ జరుగుతున్నాయని, అయితే గృహ వినియోగదారులతోపాటు హాస్పిటల్స్, విద్యాసంస్థలకు, వృద్దాశ్రమాలకు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో 810 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతున్నదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 29 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా రోజు వారీగా 2.5 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతున్నట్లు వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత ఉన్నట్లు ఎక్కడా నమోదు కాలేదని చెప్పారు. అపోహలను అడ్డుపెట్టుకుని బ్లాక్ చేయాలని చూస్తే ప్రభుత్వం ఎంతమాత్రం ఉపేక్షించదని, కఠినమైన చర్య తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. తాజాగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిల్వ చేయడం, అక్రమంగా మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడినందుకు ఇప్పటివరకు 288 కేసులు నమోదు చేశామన్నారు. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఇదేవిధంగా ప్రవర్తిస్తే మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను మంత్రి ఉత్తమ్ కుమార్ ఆదేశించారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు, సరఫరా పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకొకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకమారు ఎల్‌పిజి బుక్ చేసుకోవాలని గ్యాస్ వినియోగదారులకు సూచించారు. అదే సమయంలో అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవద్దని, గృహ వినియోగదారులకు సరిపడ గ్యాస్ సరఫరా చేస్తామంటూ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
99 రోజుల ప్రణాళికపై సమీక్ష
రాష్ట్రంలో వంట గ్యాస్, వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కోవడంతోపాటు 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికపై సచివాలయం నుండి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మంత్రి ఉత్తమ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, పౌర సరఫరాల శా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, నీటిపారుదల శా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ ఈఎన్‌సీలు రమేష్ బాబు, శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





