భద్రత విషయంలో ఎలాంటి రాజీ వద్దు

– మేడారంలో 450 సీసీ కెమెరాలతో పక్కా నిఘా
– కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పరిశీలించిన మంత్రి సీతక్క

మేడారం, ప్రజాతంత్ర, జనవరి 17: మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా శాంతిభద్రతల ఏర్పాట్లపై పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక దృష్టి సారించారు. మేడారంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఆమె శనివారం సందర్శించి కొనసాగుతున్న భద్రత ఏర్పాట్లను అక్కడినుంచి స్వయంగా పరిశీలించారు. జాతర ప్రాంతం అంతటా సుమారు 450 సీసీ కెమెరాల ద్వారా పోలీసులు కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌పై జాతర ప్రాంగణంలో జరుగుతున్న కార్యక్రమాలు, భక్తుల రాకపోకలు, జనసాంద్రత పరిస్థితులను మంత్రి సీతక్క ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరిగితే పోలీసులు ఎలా స్పందిస్తారు, ముందస్తు చర్యలు, సన్నాహాలు ఏమిటన్న అంశాలను పోలీస్‌ అధికారులు మంత్రికి వివరించారు. భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రతీ చిన్న అంశాన్ని కూడా అప్రమత్తతతో పర్యవేక్షించాలని మంత్రి పోలీస్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. భక్తులు నిర్భయంగా, ప్రశాంతంగా జాతరలో పాల్గొనేలా భద్రతా ఏర్పాట్లు ఉండాలని, పోలీస్‌ యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌, జిల్లా ఎస్పీ రామ్‌నాథ్‌ కేకన్‌, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *