– సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తాం
– కృష్ణ, గోదావరి జలాల్లో నాణ్యమైన వాటా సాధిస్తాం
– అర్హులందరికీ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు
– జాబ్ మేళా ద్వారా 4500 మందికి ఉద్యోగాలు
– మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 7: కృష్ణ, గోదావరి జలాలలో రాష్ట్ర నీటి హక్కులు సుప్రీం కోర్టు,కేంద్ర జల సంఘం,కేంద్ర ప్రభుత్వం వద్ద బలమైన వాదనలు వినిపించి సాధిస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన నిర్మిస్తున్న 2160 సింగిల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఈ నెల 8 (గురువారం) నుండి పది రోజులుపాటు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతుందని, తదుపరి అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి అర్హులను గుర్తించి ఫిబ్రవరి నెలలో ప్లాట్స్ కేటాయిస్తా మన్నారు. 15 ఏళ్ల శ్రమకు ఫలితం త్వరలో దక్కబోతుందని తెలిపారు. అద్దె ఇంట్లో ఉంటున్న, స్థలం ఉన్నా లేకపోయినా, ఇల్లు లేని అర్హులందరికీ సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎవరికీ ఒక్క పైసా ఇవ్వకుండా ఉచితంగా కేటాయిస్తామన్నారు. హుజూర్నగర్ పట్టణంలో రూ.28 కోట్ల వ్యయంతో రింగ్ రోడ్డు నిర్మించానని, కార్పొరేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాలలు నిర్మాణంలో ఉన్నాయని జూన్ నాటికి పూర్తయి అందుబాటులోకి వస్తాయని, ప్రభుత్వ హాస్పిటల్ లో నూతన ఓపి బిల్డింగ్, సిటీ స్కాన్,డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంకులను నిర్మించానని, జాబ్ మేళా ద్వారా హైదరాబాద్ నుండి 270 కంపెనీలు హుజూర్నగర్ పట్టణానికి తీసుకువచ్చి యువతకు 4500 ఉద్యోగాలు వచ్చేలా చేశానని, రూ.40 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, రూ.6 కోట్లతో ఐటిఐ కళాశాల నిర్మాణం ఇలా హుజూర్నగర్ నియోజకవర్గంలో విద్యా, వైద్య, రోడ్లు, విద్యుత్, ఇండ్లు కనివిని రీతిలో నిర్మించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నానని మంత్రి తెలిపారు. హుజూర్నగర్ పట్టణంలోని రామ స్వామి గుట్ట వద్ద అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ వద్ద బుధవారం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అంతకుముందు ఆయన హుజూర్నగర్ పట్టణంలో రూ.4.5 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రూ.7.5 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్త భవన నిర్మాణాలను, రూ. 8 కోట్లతో నిర్మిస్తున్న ఆర్&బి గెస్ట్ హౌస్ కమ్ షాపింగ్ కాంప్లెక్స్, రూ.7 కోట్లతో చేపట్టిన నీటిపారుదల శాఖ కార్యాలయ పనులను పరిశీలించి అర్థ శతాబ్దానికి పైగా సేవలు అందించేలా ప్రభుత్వ కార్యాలయాలు నాణ్యతతో నిర్మించాలని ఎలివేషన్ అద్భుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. తదుపరి హుజూర్నగర్ ఎంపీడీవో కార్యాలయం వద్ద హుజూర్నగర్ నియోజకవర్గంలోని హుజూర్నగర్,మేళ్లచెరువు, చింతలపాలెం, మఠంపల్లి,పాలకీడు నేరేడుచర్ల,గరిడేపల్లి మండలాల్లో రూ.1.71 కోట్లు విలువ చేసే షాదీ ముబారక్,కళ్యాణ్ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాధిక అరుణ్ కుమార్, ఆర్ అండ్ బి ఈ ఈ సీతారామయ్య, ఇరిగేషన్ ఈ ఈ నాగభూషణం, టి జి ఈ డబ్ల్యు ఐ డి సి డిఈ రమేష్,తహసిల్దారులు, ఎంపీడీవోలు,సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




