– ఆరు గ్యారంటీలపై స్పష్టత ఏదీ?
– కేరళ ఎన్నికల కోసం అర్థాంతరంగా ముగింపు
– ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోయారు
– పొంగులేటి అవినీతిని బయటపెట్టాం
– డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే మా ఎమ్మెల్యేల సస్పెన్షన్
– కాళేశ్వరంపై కేంద్ర మంత్రి పాటిల్ వ్యాఖ్యలు అభ్యంతరకరం
– మల్లన్న సాగర్‌లో ఇప్పటికీ 25 టీఎంసీల నీళ్లు
– బీఆర్ఎస్ నేత హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: శాసనసభ సమావేశాలు ఒక దిశా నిర్దేశం లేకుండా ముగిశాయని బీఆర్ఎస్ నేత హరీష్‌రావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలపై స్పష్టత వస్తుందని, ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన ప్రజలకు ప్రభుత్వం తీవ్ర నిరాశనే మిగిలించిందన్నారు. బడ్జెట్, బిల్లులు పాస్ చేసుకోవడానికి, రాజ్యాంగ అనివార్యతను పూర్తి చేయడానికి మాత్రమే తూతూ మంత్రంగా సభను నడిపారని ఆరోపించారు. ప్రజా సమస్యలు చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. 19 సమస్యలపై షార్ట్ డిస్కషన్ కోసం బీఆర్ఎస్ నోటీసులు ఇచ్చినా ఏ ఒక్క అంశంపైనా ప్రభుత్వం చర్చకు రాలేదు. చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి ఒక్క ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రాం కూడా లేని దయనీయ స్థితిలో కాంగ్రెస్ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగిన ప్రజా సమస్యల మీద సూటిగా సమాధానం చెప్పకుండా తొండల భాష, కండల భాష వాడారు. ప్రభుత్వం డిఫెన్స్‌లో పడ్డప్పుడల్లా ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం, గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప మరేమీ లేదు. ప్రజల పక్షాన ప్రశ్నించడానికి ప్రతిపక్షం ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నించడమే ప్రతిపక్ష బాధ్యత. ఆ బాధ్యతను బీఆర్ఎస్ నిర్వహిస్తుంటే కాంగ్రెస్ తట్టుకోలేకపోతోంది. ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా ఎత్తివేసింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం రోజు, ఆర్థిక మంత్రి బడ్జెట్ పెట్టిన రోజు ప్రశ్నోత్తరాలు లేవు. ప్రతిపక్షాల ప్రశ్నలు చర్చకు రాకుండా చేశారు. ఏ ఒక్కరోజు కూడా అసెంబ్లీని సమయానికి ప్రారంభించలేదు. సమయపాలన లేదు, సభ అంటే గౌరవం లేదు. అసెంబ్లీలో టీ బ్రేక్ 10 నిమిషాలు, లంచ్ బ్రేక్ అరగంట ఉంటుంది. కానీ, ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వస్తున్నాడని ఏకంగా 4 గంటలు టీ బ్రేక్ ఇచ్చారు. ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతున్నాడని 3 గంటలపాటు సభను ఆపారు. ప్రిపరేషన్ ఇంట్లో చేసుకోవాలి కానీ సభకు వచ్చాక చేస్తారా.. కావాలనే లేట్ నైట్ వరకు సభ నడిపి సభ్యులు లేకుండా చేయాలని చూశారు. వారం రోజులు సభను ఎక్స్‌టెండ్ చేయమని అడిగినా ప్రభుత్వం ముందుకు రాలేదు. కేరళ ఎన్నికల ప్రచారం కోసం అసెంబ్లీని 30నే హడావుడిగా ముగించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు, ప్రజా సమస్యలు ముఖ్యమా? లేక కేరళ ప్రచారం ముఖ్యమా అని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సభలో బయటపెడితే ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడ్డారు. రవీంద్రభారతిలో నాటకాలు వేశారు. అవినీతి నుంచి మంత్రిని కాపాడటానికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజులపాటు సస్పెండ్ చేసి ముఖ్యమైన బిల్లులను ఆమోదింపజేసుకున్నారు. హేట్ స్పీచ్ బిల్లును చివరి రోజు తెచ్చి చర్చ లేకుండానే ముగించారు. పద్దులన్నీ చివరి రోజు గిలెటిన్ చేసుకొని పారిపోయారు. ఇరిగేషన్ పద్దు మీద కూడా కనీస చర్చ లేకుండా పాస్ చేసుకున్నారు. హౌస్ కమిటీ పనికిరాదని చెప్పి శాసనసభ్యులకు, సభకు గౌరవాన్ని తగ్గించారన్నారు.
మిమ్మల్ని వ్యక్తిగతంగా కాదు.. ప్రభుత్వాన్ని విమర్శించాం
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ మా బడ్జెట్ చింపుతారా అని మాట్లాడుతున్నారు. మీ బడ్జెట్‌లో ఏమీ లేదు.. అది పూర్తిగా డొల్ల బడ్జెట్. కాబట్టే చింపి నిరసన వ్యక్తం చేశాము. ఈ విమర్శ ఆర్థిక మంత్రి భట్టిని వ్యక్తిగతంగా అన్నది కాదు.. ఆ హోదాలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. మీరు ప్రవేశపెట్టింది మూడో బడ్జెట్, మిగిలింది ఇంకొక్కటే బడ్జెట్. కోటి మంది మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తానని చెప్పి మూడు బడ్జెట్లలో ఎందుకు నిధులు పెట్టలేదు. అవ్వాతాతలను, రైతన్నలను, నిరుద్యోగులను, విద్యార్థులను, మహిళలను.. ఇలా అన్ని వర్గాలను మోసం చేశారు. గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రజల చెవిలో పూలు పెట్టింది మీరే. మీ మోసాలను అర్థం చేయించడానికే సభలో వినూత్నంగా చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపాము. కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని అడిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు పారిపోయారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 16 వేల ఉద్యోగాలే అని వారే శాసనసభకు ఇచ్చిన సమాధానంతో స్పష్టమైంది. నిరుద్యోగుల ఆకాంక్షను సభలో గట్టిగా వినిపించాం. రెండున్నర సంవత్సరాల్లో బీసీ కార్పొరేషన్‌కు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని రుజువు చేశాం. బీసీల గొంతుకగా బీఆర్ఎస్ పోరాడింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై కూడా స్పష్టంగా బహిర్గతం చేశాం. దళితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని ఈ ప్రభుత్వ వైనాన్ని ఎండగట్టాం. దళితులపై రేవంత్ రెడ్డిది కపట ప్రేమ మాత్రమే. కాంగ్రెస్ సభ్యులు సభలో కత్తుల కోలాటం ఆడతాం, తలలు తీస్తాం, సామాజిక బహిష్కరణ చేస్తాం అని ప హిల్వాన్ల భాష మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ప్రోత్సహించారు. ఈ వ్యాఖ్యలను ఎందుకు ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయరు? రేవంత్ రెడ్డి రెండేళ్లుగా సభలో మాట్లాడుతున్న భాష కూడా ఎథిక్స్ కమిటీకి వెళ్లాల్సిందేనన్నారు. పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఆయన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాషలాగే ఉన్నాయి. బీఆర్ఎస్‌పై బురదజల్లేందుకు కాంగ్రెస్, బీజేపీల ఫెవికాల్ బంధం బయటపడింది. నిన్న బడ్జెట్‌లో సాక్షాత్తూ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డే కాళేశ్వరంలో పారుతున్న లక్షల ఎకరాలకు అదనంగా 2024 లో 3000 ఎకరాలు కొత్తగా పారకం పెరిగింది. 2025లో కొత్త ఆయకట్టు సాగులోకి తెచ్చామని స్పష్టంగా చెప్పారు. ప్రాజెక్టు లక్ష కోట్లు కొట్టుకుపోతే ఈ కొత్త ఆయకట్టుకు పారకం ఎక్కడినుంచి వచ్చింది? భువనగిరి జిల్లాలో ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు కాలువలకు వెళ్లి నీళ్లు వదులుతున్నారు కదా.. అవి కాళేశ్వరం నీళ్లు కావా? గంధమల్ల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు, అది కాళేశ్వరంలో భాగం కాదా? హైదరాబాద్‌కు తాగునీటి కోసం మూసీ పక్కనుంచి 20 టీఎంసీల నీళ్లు తెస్తామని రూ.8,000 కోట్లతో కాలువలు తవ్వుతున్నారు కదా.. కాళేశ్వరం కొట్టుకుపోతే మల్లన్న సాగర్ నుంచి ఆ నీళ్లు ఎలా వస్తున్నాయి? ఈ నిమిషానికి కూడా మల్లన్న సాగర్‌లో 25 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసురుతున్నాను. మీరు తెలంగాణకు రండి. యాదాద్రి భువనగిరి, చొప్పదండి, జగిత్యాల, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్, నర్సాపూర్ రైతుల్ని ఆ గోదావరి నీళ్లు ఎక్కడివో అడుగుదాం. కాళేశ్వరం నీళ్ల వల్ల పండిన పచ్చని పొలాలను చూద్దాం, రైతులను పలకరిద్దాం రండి. సిద్దిపేటలో ఈ నిమిషానికి 80,000 ఎకరాల పంట పండింది.. అవన్నీ కాళేశ్వరం నీళ్లతో పండిన పంటలే కదా. నేను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి 20 ఉత్తరాలు రాశాను. ప్రభుత్వం కేవలం రూ.50 కోట్లు విడుదల చేస్తే కొత్తగా ఏడాదికి రెండు లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. కానీ ఆ నిధులు ఇవ్వకుండా పగ పట్టారు. అలా నీళ్లు ఇస్తే కాళేశ్వరం పోయింది అని తాము చెప్పిన అబద్ధం ఎక్కడ బయటపడుతుందో అన్న అక్కసుతో రైతులకు శిక్ష వేస్తున్నారు. తక్షణమే ఆ నిధులు విడుదల చేసి కాలువలకు నీళ్లు వదలాలి. చిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు సహా అన్ని వర్గాల పక్షాన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసింది. శాసనసభ మాత్రమే కాదు.. ప్రజాక్షేత్రంలో అన్ని వేదికలపైనా ప్రభుత్వ తప్పిదాలను ఎండగడతాం. కేసీఆర్ ఆదేశాల మేరకు, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





