– కృష్ణా నదీ జలాలను అప్పనంగా తీసుకుపోతున్న ఏపీ
– జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చుని చోద్యం చూస్తున్న సీఎం
– తెలంగాణ ఇరిగేషన్ శాఖ కేఆర్ఎంబీకి రాసిన లేఖ ఇది
– పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నా:హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: ఇండ్లెంట్లు కానీ బోర్డు అనుమతులు కానీ లేకుండానే ఏపీ కృష్ణా నదీ జలాలను అప్పనంగా తీసుకుపోతున్నదని బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ 28 జనవరి నాటి తాత్కాలిక ఒప్పందం 66:34 ప్రకారం దాటి ఏపీ ఇప్పటికే 664 టీఎంసీలు వాడుకున్నదని తెలిపారు. ఇంకా రెండు రోజుల్లో ఏపీ వినియోగం వాటా దాటుతుందని కేఆర్ఎంబీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. వెంటనే బోర్డు మీటింగ్ పెట్టిండి.. ఏపీ నీటి దోపిడీిని ఆపండి అని మన ఈఎన్‌సీ లేఖ రాశారన్నారు. ఆయన 28నాడు లేఖ రాస్తే 31నాడు రిటైర్ అయ్యారని, ఏపీ లెక్కకు మించిన నీళ్లు తీసుకుపోతుంటే మనకు ఈఎన్‌సీ పోస్టు నింపలేదని ఆయన అన్నారు. వారం రోజుల తర్వాత మీడియా ప్రశ్నిస్తే పోస్టు నింపిందన్నారు. ఆయన బోర్డు మెంబర్ అయినా ఆ పోస్టు ఎందుకు ఖాళీగా ఉంచిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాట కుదరలేదా.. మాట కుదరలేదా అని నిలదీశారు. ఈ వాటర్ ఇయర్‌లో 2026 జనవరి 29 నాటికి ఏపీ 664 టీఎంసీలు వాడుకున్నదని, టెంపరరీ అగ్రిమెంట్ ప్రకారం ఏపీ 66శాతమే వాడాలి కానీ 80శాతం వాడిందని చెప్పారు. రేవంతు రెడ్డి, నీళ్ల మంత్రి గడ్డి పీకుతున్నరా అని ప్రశ్నించారు. చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్లు ఉత్తరాలు రాయడం తప్ప ఏం చేస్తున్నారని హరీష్‌రావు అడిగారు. ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కోసం అడగడు. గురువు గారు ఉన్నరని భయం.. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీళ్లు తరలించుకుపోతుంటే ఈ ప్రభుత్వం కండ్లు మూసుకున్నదని విమర్శించారు.
పంటలు, పారిశ్రామిక అవసరాలు పట్టించుకునే బాధ్యత లేదా
వేసవి వస్తున్నది, తెలంగాణకు నీటి అవసరాలు ఉన్నయి.. పంటలకు, పారిశ్రామిక అవసరాలు ఉన్నాయి.. పట్టించుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. తాత్కాలికంగా అయినా మనం 34శాతం వినియోగించుకోవాలి కానీ వినియోగించుకున్నది 20శాతం వాటా మాత్రమేనని తెలిపారు. రాష్ట్రానికి 174 టీఎంసీలు వాడుకునేది ఉన్నది. అయినా వినియోగించుకోరు.. ఈరోజుకు కూడా ఏపీ 1.5టీఎంసీల నీళ్లు తీసుకుపోతున్నది. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పంటల పరిస్థితి ఏం కావాలి.. సర్కారు నడుపుతున్నరా? సర్కస్ నడుపుతున్నరా? అని హరీష్‌రావు నిలదీశారు. ఇప్పటికే అనేకసార్లు చెప్పినం. కృష్ణా జలాల వినియోగంలో బీఆర్ఎస్ పాలనతో పోల్చితే కాంగ్రెస్ హయాంలో ఎవర్ లోయెస్ట్ వాడుకున్నం అని చెప్పినం. వరుసగా రెండేళ్లల్లో అతి తక్కువ కృష్ణా జలాలను వినియోగించి రేవంతు రెడ్డి చంద్రబాబుకు గురు దక్షిణ చెల్లిస్తున్నడు.. ఈ ఏడాది 20శాతం దాటలేదని చెప్పారు.
ముఖ్యమంత్రి వైఫ్యల్యానికి ఇది నిదర్శన
ముఖ్యమంత్రే ఈ రాష్ట్రం పాలిట శాపంగా తయారైండు. హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రి హక్కులను కాలరాస్తున్నడు. పాలన మీద పట్టు లేదు, పట్టింపు లేదు.. కేఆర్ఎంబీకి లేఖ రాసి మేం చెప్పిన ఏపీ నీటి వినయోగం వాస్తవం అని ఒప్పుకున్నారు. ఏపీ అడ్డగోలుగా నీళ్ళు వాడుతున్నది అడ్డుకోమని ఇప్పుడు లేఖ రాశారు. మేం ప్రశ్నించినప్పుడే మీరు నిద్ర లేచి బాధ్యతగా వ్యవహరించి ఉంటే తెలంగాణకు ఇంత నష్టం అవుతుండేనా? నామమాత్రంగా లేఖ రాయడం తప్ప మీరు చేస్తున్నదేం లేదని ఎద్దేవా చేశారు. కేఆర్ ఎంబీ రాసిన లేఖలో 555 టీఎంసీలు తీసుకుపోయిందని ప్రస్తావించింది. వంద టీఎంసీలు తక్కువ చేసి కేఆర్ ఎంబీ చెబుతున్నది అంటే అడగాల్సిన రేవంత్ రెడ్డి అడగడు, హక్కులు కాపాడాల్సిన కేఆరఎంబీ ఏపీని ప్రశ్నించదు. బీజేపీ ప్రభుత్వం చేతిలో కేఆరఎంబీ ఉన్నది. రాష్ట్రంలో ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేసీఆర్ మీద పడి ఏడ్వడం తప్పితే నీళ్ల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు మాట్లాడరు అని హరీష్‌రావు నిలదీశారు. ఆరఆర్ టాక్స్ ఎక్కడ బయటకు వస్తదో, స్కాంలు ఎక్కడ బయటపడతవో అని రేవంతు మౌనంగా ఉంటరు? బీజేపీ కూడా మౌనంగా ఉంటది. బిజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి అని విమర్శించారు. అడ్డగోలుగా ఏపీకి నీళ్లు తరలిస్తూ తెలంగాణ రైతుల నోళ్లు కొడుతున్నరన్నారు. రేవంతు, కిషన్ రెడ్డి కలిసి తెలంగాణ గొంతు పిసుకుతారా? చంద్రబాబు, రేవంతు మధ్య ఫెవికాల్ బంధం ఉండొచ్చు కానీ రాష్ట్ర హక్కులను ఆంధ్రాకు ఎందుకు రాసిస్తున్నరుంటూ బీజేñపీ, కాంగ్రెస్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే స్పందించి ఏపీ నీళ్ల తరలింపును అడ్డుకోవాలని, క్యారీ ఫార్వర్డ్ విధానంలో పైనున్న శ్రీశైలంలో నీటిని నిల్వ ఉంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, త్వరలో కేఆరఎంబీ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కేంద్ర మంత్రిని కలుస్తాం. పార్లమెంట్‌లో గట్టిగా లేవనెత్తుతామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు 16మంది ఉండి తెలంగాణ హక్కులను కాపాడటంలో అట్టర్ ఫ్లాప్ అయితే నీటి హక్కుల కోసం బీఆరఎస్ పోరాటం చేస్తున్నదని తెలిపారు. 19 ప్లేసుల్లో బీఆర్ఎస్ టెలిమెట్రీలు పెడితే మిగతా 9 ప్లేస్లుల్లో పెట్టడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యిందని హరీష్‌రావు అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





