– ఎంఐఎం మద్దతుకుతోడు ఎక్స్ అఫీషియోల బలం
– మేయర్‌గా ఎన్నికైన ఉమారాణి
నిజామాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: నిజామాబాద్ నగర మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ ఎట్టకేలకు సోమవారం వీడింది. మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మేయర్‌గా ఉమారాణిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. నగరంలో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నగర ఓటరు బీజేపీకి 28, కాంగ్రెస్‌కు 17, ఎంఐఎంకు 14, బీఆర్‌ఎస్ కి 1 కట్టబెట్టాడు. అయితే మేయర్ పీఠం దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ 31 రావాల్సి ఉంటుంది. దీనికి మూడు అడుగుల దూరంలో బీజేపీ నిలిచిపోయింది. అలాంటి వేళ మేయర్ పీఠం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేపట్టింది. ఎంఐఎంను తన దారికి తెచ్చుకొంది. దాంతో ఈ రెండు పార్టీలు కలిస్తే 31 సీట్లు వచ్చినట్లు అయింది. ఎక్స్ అఫీషియో సభ్యుల వోట్లు కూడా కలిసి మరో రెండు వోట్లు ఆ పార్టీకి వచ్చి చేరాయి. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఒక్క అభ్యర్థి సైతం కాంగ్రెస్ లోకి వెళ్లిపోయాడు. దాంతో ఈ పీఠం సులువుగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడింది. అదీకాక పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో మేయర్ పీఠాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాంతో ఆ పీఠం కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. బిజెపి మెజార్టీ సీట్లు సాధించినా ఫలితం దక్కలేదు. మేయర్ పీఠం కాంగ్రెస్ చేజిక్కించుకోవడంతో స్థానిక ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ధర్మపురి అర్వింద్ సోమవారం స్పందించారు. మూడు వోట్ల తేడాతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కాంగ్రెస్ గెల్చుకుందన్నారు. బీజేపీని ఓడించేందుకు బీఅర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం లు ఒకటయ్యాయని మండిపడ్డారు. కాళేశ్వరం, ఈ-కార్ రేసింగ్ తదితర కేసుల్లో బీఆర్‌ఎస్ అధినేతలు కేసీఆర్, కేటీఆర్‌లను సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారో ఈ రోజు అర్థమైందమన్నారు. ఇందూరులో బీజేపీని ఓడించడానికి అనైతిక పొత్తుకు శ్రీకారం చుట్టారంటూ ఎంపీ అర్వింద్ నిప్పులు చెరిగారు. బీజేపీ ఓటమిలో కాంగ్రెస్ రంగు పూసుకుని తిరిగే పోలీసుల హస్తం కూడా ఉందని ఈ సందర్భంగా ఆరోపించారు. ఈ ఐదేళ్ల పదవి పూర్తయ్యే లోపు ఈ ఫలితాన్ని రివర్స్ చేసి చూపిస్తామని ఆయన శపథం చేశారు. ఈ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని ప్రకటించారు.
కామారెడ్డి ఛైర్‌పర్సన్‌గా ఇప్ప ఉమారాణి
కామారెడ్డి: కామారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచిన ఇప్ప ఉమారాణిని చైర్ పర్సన్ పీఠం వరించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేది లేదంటూ కామారెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ నేతలు తేల్చి చెప్పారు. దాంతో తాజాగా పార్టీలో చేరిన ఉమారాణి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. మరోవైపు వైస్ చైర్మన్ స్థానాన్ని బీఆర్‌ఎస్ నేతలు కోరారు. కాసర్ల గోదావరి వైస్ చైర్మన్ పదవి దక్కించుకున్నారు.
—————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




