కాజీపేట, ప్రజాతంత్ర, ఆగష్టు 5: వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ(నిట్), థాయ్‌లాండ్‌కు చెందిన ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. నిట్, థాయ్‌లాండ్ కంపెనీ మధ్య గ్లోబల్ అకడమిక్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడిరది. ఆన్‌లైన్ వేదికగా అవగాహన ఒప్పందంపై రెండు సంస్థలు మంగళవారం సంతకం చేశాయి. వరంగల్ నిట్ తరఫున డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డీన్ ప్రొఫెసర్ వెంకయ్య చౌదరి, ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ డీన్ ప్రొఫెసర్ పి.రతీష్ కుమార్, పరిశోధన, అభివృద్ధి డీన్ ప్రొఫెసర్ సోనావాణే షిరిష్ హరి, విద్యార్థుల సంక్షేమం డీన్ ప్రొఫెసర్ కె.కిరణ్ కుమార్, రిజిస్ట్రార్ సునీల్ కుమార్ మెహతా, సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కె.వెంకటరెడ్డి, ప్రొఫెసర్ ఎం.శశి, ప్రొఫెసర్ మనాలి పాల్‌లు పాల్గొన్నారు. థాయ్‌లాండ్ ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తరఫున వివిధ విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు సంగమ్ శ్రేష్ఠ, నితిన్ కుమార్ త్రిపాఠి, డాక్టర్ సుమన శ్రేష్ఠ, మిస్ అలిస్టినా శ్రేష్ఠ, ఆర్థర్ లాన్స్ గోన్జాలెస్, రణధీర్ మందాడిలు పాల్గొన్నారు. ఈ ఒప్పందం ద్వంద్వ మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్, ఉమ్మడి పరిశోధన, విద్యార్థులు, బోధన సిబ్బంది మార్పిడి, అంతర్జాతీయ సెమినార్లు, వర్క్‌షాప్‌ల నిర్వహణ వంటి కార్యక్రమాలను ప్రోత్సహించడానికి దోహదపడుతుంది. మొదటి ద్వంద్వ మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్ జియో ఇన్ ఫార్మాటిక్స్ స్పెషలైజేషన్‌లో ప్రారంభమవుతుంది. ఇది రెండేళ్ల వ్యవధి గల ప్రోగ్రామ్. ప్రతి స్పెషలైజేషన్‌కు 20మంది విద్యార్థులను స్వీకరిస్తారు. విద్యార్థులు రెండు సంస్థల అకడమిక్ అవసరాలను పూర్తిచేశాక వరంగల్ నిట్ నుంచి ఎంటెక్, థాయ్‌లాండ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మాస్టర్ డిగ్రీ పొందుతారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రొఫెసర్ సుబుధి మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం భారతీయ ఉన్నత విద్యా వ్యవస్థను అంతర్జాతీయీకరణ దిశగా తీసుకెళ్లే మంచి అడుగని పేర్కొన్నారు. ఇది కేవలం విద్య మార్పిడికే కాదు.. ప్రపంచస్థాయిలో పరిశోధన, ఆవిష్కరణలకు రెండు సంస్థల మధ్య వేదికని అన్నారు. నిట్ మాజీ విద్యార్థి ప్రొఫెసర్ నితిన్ త్రిపాఠి ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరిస్తానని, ప్రపంచస్థాయిలో నాణ్యమైన విద్య, ఆవిష్కరణల ద్వారా సమాజానికి సేవ చేయడమే లక్ష్యమని చెప్పారు. రాబోయే రోజుల్లో పరస్పర సందర్శనలు, మరిన్ని ఉమ్మడి కార్యక్రమాల ద్వారా ఈ ఒప్పందం ప్రయోజనాలను మరింత విస్తరించాలని రెండు సంస్థలూ నిశ్చయించాయి.
నిట్, థాయ్‌లాండ్ కంపెనీ మధ్య ఎంఓయు





