– వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ సమర్పణ
– అత్యధికసార్లు ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా ఘనత
న్యూదిల్లీ, జనవరి 30: నిర్మలా సీతారామన్ ఆర్థికమంత్రిగా చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1న ఆమె పార్లమెంటులో బడ్జెడెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా ప్రవేశపెట్టనున్న 9వ బడ్జెట్ ఇది. పార్లమెంటులో 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు మాజీ మంత్రి పి.చిదంబరం సొంతం. 1996లో అప్పటి ప్రధాని హెచ్‌డీ దేవగౌడ సారథ్యంలో మంత్రి చిదంబరం తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత 1997లో రెండోసారి, 2004-08 మధ్య కాలంలో వరుసగా ఐదు సార్లు, 2013, 2014ల్లో మరో రెండు సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక లోక్‌సభలో అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన మంత్రిగా నిర్మలా సీతారామన్ ఇప్పటికే అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. భారత్‌కు సంబంధించిన తొలి బడ్జెట్‌ను 1860లో అప్పటి ఆర్థిక మంత్రి జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. భారత మండలి సభ్యుడిగా ఆయన ఈ బడ్జెట్‌ను తీసుకొచ్చారు. 1857 సిపాయి తిరుగుబాటు అనంతరం భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణల పేరిట వలస పాలకులు ఈ బడ్జెట్‌ను తీసుకొచ్చారు. స్వాతంత్యాన్రంతరం 1947 నవంబర్ 26న భారత దేశ ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముఖం చెట్టి తొలి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అత్యధికసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డును మాజీ ప్రధాని మోరార్జీ దేశాయ్ సొంతం చేసుకున్నారు. మొత్తం 10 బడ్జెట్‌లను ఆయన పార్లమెంటు ముందుకు తెచ్చారు. 1959-64 మధ్యకాలంలో ఆర్థిక మంత్రిగా ఆరుసార్లు, తరువాత 1967-1969 మధ్య మరో నాలుగుసార్లు ప్రవేశపెట్టారు. ఇక ప్రణబ్ ముఖర్జీ కూడా వివిధ సందర్భాల్లో మొత్తం 8 బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. 1982-84 మధ్యకాలంలో వరుసగా మూడుసార్లు, 2009-12 మధ్య వరుసగా ఐదుసార్లు బడ్జెట్‌ను తీసుకొచ్చారు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వరుసగా ఐదుసార్లు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.ఇప్పుడు తొమ్మిదోసారి నిర్మలమ్మ బడ్జెట్‌తో ముందుకు రానున్నారు. ఈ మూడేళ్లు ఆమె ఆర్థిక మంత్రిగా కొనసాగితే రికార్డు సృష్టించడం ఖాయం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





