– జిల్లాకు ప్రత్యేకంగా రూ.10 కోట్లు కేటాయింపు
– కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన సీతక్క
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 14: నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు కార్యక్రమాన్ని చేపట్టగా ఇందు కోసం తెలంగాణలోని ములుగు జిల్లాను ఎంపిక చేసింది. ఈ పథకం ద్వారా ములుగు జిల్లాలో మహిళలు, బాలికల భద్రత, గౌరవం, రాకపోకల సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు జెండర్-రెస్పాన్సివ్ మౌలిక సదుపాయాలు, మెరుగైన నిఘా వ్యవస్థలు, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. ములుగులో ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసేందుకు అవసరమైన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారీలో జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పూర్తి సహకారాన్ని అందిస్తుందని కేంద్ర మంత్రికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క చెప్పారు. ములుగు జిల్లాను ఎంపిక చేయడం పట్ల, జిల్లాకు ప్రత్యేకంగా 10 కోట్లు కేటాయిండం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని శనివారం దిల్లీలో కలిశారు. మహిళా సాధికారత, భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవను అభినందిస్తూ తెలంగాణలో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళల రక్షణను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతక్క స్పష్టం చేశారు.
క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు పెంచాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాలనా – మిషన్ శక్తి పథకం కింద పనిచేస్తున్న క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల గౌరవ వేతనాలను పెంచాలని కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం క్రెచ్ వర్కర్లకు నెలకు రూ.5,500, హెల్పర్లకు రూ.3,000 మాత్రమే గౌరవ వేతనంగా ఇస్తున్నారని, ఇది వారు చేసే పనికి, బాధ్యతకు ఏమాత్రం సరిపోదని వివరించారు. ఒక క్రెచ్‌లో దాదాపు 25మంది పిల్లల సంరక్షణను చూడటం ఎంతో బాధ్యతతో కూడుకున్న పని అని, ప్రస్తుత జీవన ప్రమాణాల దృష్ట్యా ఈ వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని మంత్రి సీతక్క వివరించారు. తక్కువ వేతనాల వల్ల నిపుణులైన సిబ్బందిని ఈ పథకంలో కొనసాగించడం కష్టమవుతోందని, ఇది పరోక్షంగా శిశు సంరక్షణపై ప్రభావం చూపుతోందని అన్నారు. పనిచేసే తల్లులకు అండగా నిలిచే ఈ పథకం విజయవంతం కావాలంటే సిబ్బందికి ఇచ్చే వేతనాలను ప్రస్తుత వేతన ప్రమాణాలÅ£నుగుణంగా పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మహిళా సాధికారత, శిశు సంక్షేమం కోసం పనిచేస్తున్న సిబ్బంది ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కేంద్రం ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




