తొంభ‌యిశాతం ధాన్య సేక‌ర‌ణ పూర్తి

– సీజ‌న్ ముందుగా రావ‌డంతో కొనుగోళ్ల‌కు అడ్డంకులు
-48 గంట‌ల్లో రైతుల ఖాతాల్లోకి నిధులు
-క‌లెక్ట‌ర్లు ప్రోయాక్టివ్‌గా వుండాలి
– రైతుల‌కు ఎరువులు సిద్ధం
– ఇబ్బంది పెట్టే మిల్ల‌ర్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు
– భూభార‌తిపై అవ‌గాహ‌నా స‌ద‌స్సులు
– జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం ఘ‌నంగా జ‌ర‌పాలి
– వీడియో కాన్ఫ‌రెన్స్ లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు వొచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. ఇప్పటివరకు 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందంటూ  అధికారులు, కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, రుతుపవనాలు, వానాకాలం పంటల సాగు అంశాలపై చర్చ జ‌రిగింది. రుతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించడం ఇబ్బందిగా మారింది. ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటి వరకు రైతులకు రూ. 12184 కోట్లు చెల్లించామ‌న్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామ‌ని గుర్తు చేశారు. చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న చిన్న సంఘటనలు ప్రచారంలోకి వొస్తున్నాయి. కొన్నిచోట్ల రాజకీయ ప్రేరేపిత సంఘటనలు జరుగుతున్నాయ‌న్నారు.  అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు వల్లనే అని దుష్ప్రచారం చేశార‌న్నారు. కలెక్టర్లు ప్రో యాక్టివ్ గా ఉండి  ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించాల‌ని ఆదేశించారు.చిన్న చిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించాల‌న్నారు.

స‌మ‌యం వృధా చేయొద్దు.. నిర్లక్ష్యం వహించొద్దు. అవసరమైతే లోకల్ గోడౌన్స్ అద్దెకు తీసుకోమ‌ని సూచించారు. మిల్లర్లు, దలారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోండి. ఈసారి 29 శాతం వర్షపాతం అధికంగా ఉంది.సీజన్ ముందు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాల‌ని ఆదేశించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి.పంటల వివరాలు, స్థానిక అవసరాలను గుర్తించి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాల‌న్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అలాంటి వారిపై పీడీ యాక్ట్ న‌మోదు చేయాల‌న్నారు.

నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి.కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. జిల్లాలవారిగా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియనించుకోండి. భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలి. భూభారతి చట్టాన్ని ప్రజలకు చేరువ చేయాల‌న్నారు. జూన్ 3 నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు చాలా కీల‌కం.  క్షేత్రస్థాయిలో అమ‌లు జరగాలంటే అది కలెక్టర్ల చేతిలోనే ఉంద‌న్నారు. మండలస్థాయిలో ధరల నియంత్రణ కమిటీ వేయాలి.మేస్త్రీ చార్జీలు, క్రషర్ ధరలను పర్యవేక్షించాలన్నారు. ఉచిత ఇసుక కూపన్లు సకాలంలో సరఫరా చేయాలి.

ఇటుక తయారీ, సెంట్రింగ్ యూనిట్స్ ఏర్పాటుకు రుణాలు అందించాల‌న్నారు. క్షేత్ర స్థాయిలో వాస్త‌వ‌విక  సమస్యలను గుర్తించి పరిష్కరించాలి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలి.  29, 30 తేదీల్లో జిల్లాల ఇంచార్జ్ మంత్రులు సంబంధిత జిల్లాల్లో పర్యటించి. జూన్ 1 నాటికి పూర్తి నివేదిక అందించాలని ఆదేశించారు.  జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాల‌ని పిలుపునిచ్చారు. ఈ స‌మావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, అన్ని జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *