– ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్ జస్టిస్ రామసుబ్రమణియన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29: మన వద్ద మంచి చట్టాలు, పథకాలు ఉన్నాయి.. వాటి ఫలితాలు ప్రజలకు కచ్చితంగా అందాలంటే అమలు గట్టిగా ఉండాలి అని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చైర్‌పర్సన్ జస్టిస్ రామసుబ్రహ్మణియన్ అన్నారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటన సందర్భంగా ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రభుత్వ ముఖ్య అధికారులతో కమిషన్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలోని ప్రధాన మానవ హక్కుల సమస్యలపై చర్చించి వాటిని ఎదుర్కొనడంలో ప్రభుత్వ యంత్రాంగం చేపడుతున్న చర్యలు, సంక్షేమ చర్యల అమలును సమీక్షించడం ఈ సమావేశం లక్ష్యం. సమావేశానికి జస్టిస్ రామసుబ్రమణియన్ అధ్యక్షత వహించగా కమిషన్ సభ్యులు న్యాయమూర్తి బిద్యుత్ రంజన్ సారంగి, విజయభారతి సాయనీ, మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర చైర్మన్ న్యాయమూర్తి డాక్టరు షమీమ్ అక్తర్ పాల్గొన్నారు. కేంద్ర కమిషన్ తరఫున కార్యదర్శి జనరల్ భరత్‌లాల్, డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) ఆర్.పీ.మీనా, డిప్యూటీ రిజిస్ట్రార్(లా) ఇంద్రజీత్, డాక్టర్ ముఖేష్, ఎస్‌ఎస్‌పీ (ఇన్వెస్టిగేషన్) ఇలక్కియా కరుణాగరణ్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో హోం, మహిళా, శిశు సంక్షేమం, విద్య, అటవీ, వ్యవసాయం, ఎస్సీ అభివృద్ధి, పోలీస్ విభాగాల నుండి సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఓపెన్ హియరింగ్ సందర్భంగా కమిషన్ రెండు బెంచ్‌లచే 90 కేసులను విచారించింది. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, పోషకాహార లోపం, ప్రాథమిక విద్యలో లోపాలు, ఎస్సీ సంక్షేమం, రైతుల సమస్యలు, ఎల్‌జీబీటీక్యూఐ హక్కుల అంశాలపై చర్చ జరిగింది. రవి గుప్త్ణా హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించి శాఖల సమన్వయానికి నేతృత్వం వహించారు. మానవ హక్కుల పరిరక్షణలో పరిపాలనా పారదర్శకత, న్యాయవ్యవస్థ పటిష్టతపై ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. అదనపు డీజీపీ (మహిళల భద్రత, సీఐడి) చారుసిన్హా, అదనపు డీజీపీ (మహిళల భద్రత, ఎల్‌జీబీటీక్యూఐ హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా షీ టీమ్స్, భరోసా కేంద్రాలు విస్తరణ, ప్రతి జిల్లాలో మైత్రి క్లినిక్‌లు ఏర్పాటు, ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్‌లకు ఉద్యోగ అవకాశాలు, ఉచిత న్యాయ సహాయం వంటి అంశాలను వివరించారు. మహిళా, శిశు సంక్షేమ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్ పిల్లలపై నేరాలు, పోషకాహార లోపం వంటి అంశాలపై వివరించారు. ప్రధాన అటవీ సంరక్షణాధికారి సి.సువర్ణ ప్రాణి-మనుషుల మధ్య సంభవిస్తున్న సంఘర్షణలపై, అటవీ హక్కుల చట్టం అమలు, సీఏఎంపీఏ నిధుల వినియోగం, వన్యప్రాణుల నివాస ప్రదేశాల పరిరక్షణపై మాట్లాడారు. స్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.శిథిజా రాజీవ్ యువ వికాసం వంటి ఆర్థిక, ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే పథకాలను వివరించారు. పాఠశాల విద్యా కమిషనర్ నవీన్ నికోలస్ ప్రాథమిక విద్య మెరుగుకు చేపడుతున్న చర్యలు, బడిబాట కార్యక్రమం, ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనాలు, ఫేసియల్ రికగ్నిషన్ హాజరు వ్యవస్థ గురించి వివరించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి.గోపీ రైతు భరోసా, రైతు బీమా, పంట రుణ మాఫీ వంటి పథకాల అమలును వివరించారు. వ్యవసాయ ఆదాయ భద్రతకు మార్కెట్ లింకేజెస్, సమయోచిత ఆర్థిక మద్దతుపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం సమన్వయంతో సహకరించినందుకు చైర్మన్ రామసుబ్రమణియన్ ప్రశంసించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు సమావేశంలో జరిగిన చర్చలను సమీక్షించి కమిషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం హక్కుల ఆధారిత పరిపాలనను బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.



