109 మానవ హక్కుల ఉల్లంఘన కేసులపై విచారణ

~ సోమ, మంగళవారాల్లో ఎన్‌హెచ్‌ఆర్‌సీ బహిరంగ విచారణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 27: జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఈనెల 28, 29 తేదీల్లో రాష్ట్రానికి చెందిన 109 మానవ హక్కుల ఉల్లంఘన కేసులను విచారించేందుకు హైదరాబాద్‌లో రెండు రోజులపాటు ప్రత్యేక బహిరంగ విచారణ చేపట్టనుంది. చైర్‌పర్సన్‌ జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, సభ్యులు జస్టిస్‌ (డాక్టర్‌) విద్యుత్‌ రంజన్‌ సారంగి, విజయ భారతి సయాని సోమవారం ఉదయం 10 గంటల నుంచి జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఫిర్యాదుదారులు, సంబంధిత రాష్ట్ర అధికారుల సమక్షంలో కేసులను విచారించనున్నారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రధాన కార్యదర్శి భరత్‌లాల్‌, డైరెక్టర్‌ జనరల్‌(దర్యాప్తు) ఆర్‌.పి.మీనా, రిజిస్ట్రార్‌ (లా) జోగిందర్‌ సింగ్‌, ఇతర సీనియర్‌ అధికారులు కూడా హాజరుకానున్నారు. 29న ప్రభుత్వ సీనియర్‌ అధికారులతో ఎన్‌హెచ్‌ఆర్‌సీ సమావేశం కానుంది. కాగా, మానవ హక్కుల ఉల్లంఘన బాధితులకు అక్కడికక్కడే త్వరితంగా న్యాయం అందించేందుకు 2007 నుంచి ఎన్‌హెచ్‌ఆర్‌సీ వివిధ రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రత్యేక బహిరంగ విచారణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గత వారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చింది. గతంలో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, కర్ణాటక, గుజరాత్‌, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్‌, మణిపూర్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌, జార్ఖండ్‌, అండమాన్‌-నికోబార్‌, నాగాలాండ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, మహారాష్ట్రలలో ఈ కార్యక్రమాలను నిర్వహించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *