28, 29లలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ బహిరంగ విచారణ

– హైదరాబాద్‌లో రెండు రోజుల పర్యటన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: తెలంగాణకు చెందిన 109 మానవ హక్కుల ఉల్లంఘన కేసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) రెండు రోజులపాటు హైదరాబాద్‌లో ప్రత్యేక బహిరంగ విచారణను(ఓపెన్‌ హియరింగ్‌ అండ్‌ క్యాంప్‌ సెట్టింగ్‌) చేపట్టనున్నది. న్యాయాన్ని వేగంగా అందించేందుకు రాష్ట్ర అధికారులు, ఫిర్యాదుదారుల సమక్షంలో ఈనెల 28,29 తేదీలలో ఈ బహిరంగ విచారణ చేపట్టనున్నది. మానవ హక్కులపై అవగాహన కోసం రాష్ట్రంలోని సీనియర్‌ అధికారులతో సమావేశమవడమేగాక మానవ హక్కులకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల కార్యకర్తలు, ప్రతినిధులతో కూడా భేటీ కానున్నది. అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నది.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, సభ్యులు జస్టిస్‌ (డాక్టర్‌) విద్యుత్‌ రంజన్‌ సారంగి, విజయ భారతి సయాని మొదటి రోజు ఉదయం 10 గంటల నుంచి జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) ఫిర్యాదుదారులు, సంబంధిత రాష్ట్ర అధికారుల సమక్షంలో కేసులను విచారించనున్నారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రధాన కార్యదర్శి భరత్‌ లాల్‌, డైరెక్టర్‌ జనరల్‌(దర్యాప్తు) ఆర్‌.పి.మీనా, రిజిస్ట్రార్‌(లా) జోగిందర్‌ సింగ్‌, ఇతర సీనియర్‌ అధికారులు హాజరుకానున్నారు. ఆయా కేసుల్లో పోలీసుల అధికార దుర్వినియోగం, ప్రభుత్వం ఇచ్చే వివిధ సామాజిక సంక్షేమ పథకాల కింద ప్రయోజనాలను తిరస్కరించడం, జైళ్లలో అక్రమాలు, ఎస్సీ, ఎస్టీలకు చెందిన మానవ హక్కులను పరిరక్షించడంలో నిర్లక్ష్యం, రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల హక్కులు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, అక్రమ రవాణా వంటివి విచారణకు రానున్నాయి. 29న ప్రభుత్వ సీనియర్‌ అధికారులతో ఎన్‌హెచ్‌ఆర్‌సీ సమావేశం కానుంది. మానవ హక్కులకు సంబంధించిన వివిధ సమస్యలు, ఉల్లంఘన, బాధితులకు త్వరితంగా న్యాయం అందించడానికి ఉన్న ప్రాముఖ్యతపై వారికి అవగాహన కల్పించనుంది. సమాజంలోని వివిధ వర్గాల సంక్షేమానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఇచ్చిన వివిధ సలహాలపై రాష్ట్ర ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థలు తీసుకున్న క్రీయాశీల చర్యలను కూడా సమీక్షించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్రంలోని మానవ హక్కుల సమస్యల గురించి తెలుసుకునేందుకు పౌర సమాజ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల పరిరక్షక (హెచ్‌ఆర్‌డీ) ప్రతినిధులతో భేటీ కానుంది. ఈ ప్రత్యేక బహిరంగ విచారణ కార్యక్రమం ఫలితాలు, ఎన్‌హెచ్‌ఆర్‌సీ తీసుకున్న చర్యలను విస్తృతస్థాయిలో తెలియజేసేందుకు మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *