- కేంద్రానికి సిఫార్సు చేసిన ప్రస్తుత సీజేఐ గవాయ్
న్యూదిల్లీ, అక్టోబర్ 27: సుప్రీంకోర్టు కొత్త ప్రధాన నాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ శర్మ నియామకం కానున్నారు. ఆయన పేరును సీజేఐ భూషణ్ రామకృష్ణ గవాయ్ కేంద్రానికి సిఫారసు చేశారు. జస్టిస్ సూర్యకాంత్ పేరును ఒక లేఖలో కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఆయన తెలియజేశారు. గవాయ్ వారసుడి ఎన్నిక పక్రియను కేంద్రం ఇటీవల ప్రారంభించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిని సీజేఐ పదవికి ఎంపిక చేస్తారు. ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానంలో జస్టిస్ కాంత్ సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా ఉన్నారు. గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో దేశ 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపడతారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఆయన ఈ పదవిలో ఉంటారు. హర్యానాలోని హిస్సార్‌లో 1962 ఫిబ్రవరి 10న జస్టిస్ సూర్యకాంత్ జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. 370వ అధికరణ రద్దు, భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, అవినీతి, పర్యావరణం, లింగ సమానత్వం వంటి కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో ఆయన ఉన్నారు. ఎన్నికల జవాబుదారీతనంపై తన నిబద్ధతను చాటుకుంటూ బిహార్ వోటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది వివరాలను వెల్లడించాలని ఇటీవల ఎన్నికల కమిషన్‌ను ఆయన ఆదేశించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌తో సహా బార్ అసోసియేషన్లలో మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ చేయాలని చారిత్రక ఆదేశాలు సైతం ఇచ్చారు. 2022లో ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై దర్యాప్తునకు ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిన ధర్మాసనంలో ఆయన కూడా ఉన్నారు. రక్షణ బలగాలకు ఓఆర్‌ఓపీ స్కీమ్‌ను సైతం ఆయన ధ్రువీకరించారు. పెగాసస్ స్పైవేర్ కేసును విచారించిన ధర్మాసనంలోనూ జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





