– సీఎం రేవంత్ రెడ్డి కానుకగా రెండు కొత్త పథకాలు
– ప్రారంభించిన మంత్రి అడ్లూరి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: తెలంగాణలో మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో చరిత్రాత్మక అడుగు వేసింది. రెండు కొత్త పథకాలను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం సచివాలయంలో లాంచనంగా ప్రారంభించారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంతన్న కా సహారా-మిస్కీన్‌ల కోసం పేరుతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించిన పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడిరచారు. ఈ రెండు పథకాలను ముస్లిం మైనారిటీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ రెండు పథకాలు మైనారిటీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయన్నారు. వితంతువులు, విడాకులు పొందినవారు, అనాధలు, అవివాహితలు చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ యోజన తోడ్పడుతుందని తెలిపారు. ఫకీర్, దూదేకుల వర్గాలకు వాహనాలు ఇవ్వడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్పారు. ఈ రెండు పథకాలకే ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించడం మైనారిటీల పట్ల అంకితభావానికి నిదర్శనం అని చెప్పారు. లబ్ధిదారులు ఈ సాయాన్ని కుటుంబాభివృద్ధికి వినియోగించుకోవాలనీ సూచించారు. మైనారిటీల అభివృద్ధి అంటే కేవలం సబ్సిడీలు కాదు.. వారి స్వయం ఉపాధికి దారి చూపడం తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. ఈ పథకాలు తాత్కాలిక సహాయం మాత్రమే కాదు, మైనారిటీల దీర్ఘకాలిక స్థిరమైన అభివృద్ధికి పునాది అని అన్నారు. రిజిస్ట్రేషన్లు ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ముగింపు తేదీ అక్టోబర్ 6. ఆఫ్‌లైన్ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. ఆన్‌లైన్ TGOBMMS వెబ్ పోర్టల్ tgobmms.cgg.gov.in ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, గ్రంథాలయాల చైర్మన్ డాక్టర్ రియాజ్, కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మనలా మోహన్ రెడ్డి, టీజీఎంఎఫ్‌సీ ఎండీ అండ్ వీసీ కాంతి వెస్లీ, షఫియుల్లా, ఏజీఎం కె.పెర్సిస్, ప్రాంతీయ అధికారి ప్రవీణ్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





