– ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాం
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: మరో మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకుంటానని చెప్పారు. తనకు సెంటిమెంట్ ఎక్కువన్న ఆమె.. మంచి మూహూర్తం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. కొంత కాలం గడిచిన తర్వాత తన బలం ఏంటో అందరికీ అర్థమవుతుందని కవిత వ్యాఖ్యానించారు. ప్రజలే తనను నాయకురాలిగా తీర్చిదిద్దాలని, వారి మద్దతే తనకు అసలైన బలమని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌తో తనకు ఒరిగిందే లేదని స్పష్టం చేసిన కవిత.. భవిష్యత్తులో తన రాజకీయ ప్రయాణం పూర్తిగా ప్రజల మద్దతుపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఎందుకు ప్రచారం చేయడం లేదని కవిత ప్రశ్నించారు. జాగృతి సంస్థ పోటీ చేస్తున్న ప్రాంతాల్లో హరీష్ రావు ఎందుకు తిరుగుతున్నారని నిలదీశారు. అలాగే కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గానికే ఎందుకు పరిమితమయ్యారని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. తనపై విమర్శలు చేస్తున్న వారిపై కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ’గుంటనక్క, గూఢచారి’ వంటి పేర్లు వారికి నప్పుతాయి కాబట్టే అలా పిలుస్తున్నాన న్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమేనని, కానీ వ్యక్తిగత ఆరోపణలు చేస్తే తాను కూడా మౌనంగా ఉండబోనని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తన రాజకీయ వ్యూహం మరింత స్పష్టంగా ఉంటుందని, కొత్త పార్టీ ప్రకటనతో రాజకీయాల్లో కొత్త చర్చ మొదలవుతుందని కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలావుంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై జాగృతి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
———————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





