– ఏప్రిల్ 25న పార్టీ పేరు, జెండా, ఎజెండాను ప్రకటిస్తా
– శ్రీరామ నవమి అయినందున ప్రకటన చేస్తున్నా
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
నిజామాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు నూతన రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పేరు, జెండాను ప్రకటిస్తామన్నారు. శ్రీరామనవమి మంచి రోజు కాబట్టి ఇవాళ ప్రకటన చేస్తున్నట్లు చెప్పారు. యువత, మహిళలకు తమ పార్టీలో మంచి స్థానం ఉంటుందని, ఇన్నాళ్లూ మగవాళ్లు ఏర్పాటు చేసిన పార్టీలను చూశారు.. ఇపుడు తెలంగాణ ఆడబిడ్డగా తాను పార్టీ పెడితే ఎలా ఉంటుందో మీరే చూస్తారుగా అని అన్నారు. దీంతో నూతన పార్టీపై కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు కవిత తెరదించారు. కార్యకర్తలంతా సమయానికి చేరుకోవాలని, ప్రతి గ్రామం నుంచి తరలి రావాలని కవిత పిలుపునిచ్చారు. జయశంకర్ పేరు పెట్టుకుంటామని చెప్పారు. యువతకు, మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. ఆడబిడ్డల్లో మార్పు తేవడానికి ఒక ఆడబిడ్డగా ఈ పార్టీని పెడుతున్నానని తెలిపారు. బీసీ బిల్లు సాధించడం తమ వల్లనే సాధ్యమవుతుందన్నారు. బీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు తరలిరావాలని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ రాజకీయాలను శ్రీరాముడి స్ఫూర్తితో గమనించాలన్నారు. నేను నిజామాబాద్ బిడ్డను.. నిజామాబాద్ మట్టి మంచిది.. ఇక్కడ తీసుకునే ఏ నిర్ణయమైనా సక్సెస్ అయింది అని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణంగా సాధించలేకపోయామన్నారు. రోజూ ప్రజల అవస్థలు చూస్తున్నామని కవిత వ్యాఖ్యానించారు. కచ్చితంగా ఒక కొత్త పార్టీ రావాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ మెచ్చేలా ఆ పార్టీ ఉండాలని అభిప్రాయపడ్డారు. సర్వోదయ తెలంగాణ రావాలని కవిత పేర్కొన్నారు. తాము ఎవ్వరికీ ‘బి’ పార్టీ కాము. తమది నంబర్ వన్ పార్టీ అవుతుంది. శ్రీరాముడి స్ఫూర్తితో, సిద్దాంతాలను ఆదర్శంగా తీసుకుని పనిచేస్తామన్నారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 95 శాతం తెలంగాణ ప్రాంతీయ పార్టీగా, ఇంటి పార్టీగా రాబోతోందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై వెంటపడి అడగాలన్నారు. ఎంపీ అర్వింద్ మతిమరుపు నాయకుడు. రైల్వే ఓవర్ బ్రిడ్జిల జాప్యానికి తానే కారణం అన్నారు. ఆయన వచ్చాక ఏం చేస్తున్నారు. అవసరమైతే దిల్లీలో లాబీ చేస్తా, గల్లీలో పని చేస్తా అని కవిత స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





