– ఒకప్పుడు వలస వెళ్లిన నేల
– ఇప్పుడు వలస కూలీలకు ఉపాధి కేంద్రం
– అన్ని రంగాలలో సిద్దిపేట అగ్రగామి
– సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని సిద్దిపేట నియోజకవర్గం వ్యవసాయం, ఉపాధి రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించి అగ్రగామిగా నిలిచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు.సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో బుధవారం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు 12,857 మందికి రూ.41 కోట్ల 13 లక్షల ఆర్థిక సాయం అందించామని, ఈరోజు 300 మందికి రూ.62 లక్షల 88 వేల విలువైన చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ సాయం అందుకున్న నియోజకవర్గంగా సిద్దిపేట నిలిచిందని పేర్కొన్నారు. ఒకప్పుడు తాగునీటికోసం ఇబ్బందులు పడిన సిద్దిపేటలో, నేడు మండుటెండల్లో కూడా కాలువల్లో గోదావరి జలాలు గలగలా పారుతుండగా, చెరువులు నిండుగా ఉండి పచ్చని పంటలు కళకళలాడుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం 85 వేల ఎకరాల్లో వరి సాగు జరుగుతోందని చెప్పారు. గతంలో బతుకుదెరువు కోసం సిద్దిపేట ప్రజలు బొంబాయి, దుబాయ్‌లకు వలస వెళ్ళేవారని, ఇప్పుడు బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి వరి నాట్లు వేస్తుండటం అభివృద్ధికి నిదర్శనమన్నారు. ఎకరానికి రూ.4 నుంచి 5 వేల వరకు తీసుకుని కూలీలు పనిచేస్తున్నారని వివరించారు.వ్యవసాయంతో పాటు మిర్చి, ఆయిల్ పామ్ సాగుతో రైతులు లాభాలు పొందుతున్నారని, మిట్టపల్లి ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా పరిశ్రమలు, సిద్దిపేట ఐటీ పార్క్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఐటీ రంగంలో 600 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. ఆపదలో ఉన్న ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని, అందించిన చెక్కులను వెంటనే బ్యాంకుల్లో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. సమష్టిగా కృషి చేస్తే రాబోయే రోజుల్లో కూడా సిద్దిపేటను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





