– భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడలు మేళవింపుతో ఉండాలి
– విజన్ డాక్యుమెంట్ 2047లో విద్యా విధానానికి ప్రత్యేక అధ్యాయం
– రాష్ట్ర విద్యా విధానంపై సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– అభిప్రాయాలు, అనుభవాలను వెల్లడించిన విద్యావేత్తలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: క్షేత్రస్థాయి పరిస్థితులు, అధ్యయనం, భవిష్యత్ అవసరాలకు తగినట్లు రూపొందించే తెలంగాణ విద్యా విధానం (టెప్) భారతదేశ విద్యా విధానానికి దిక్సూచిలా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో భాష ఉన్న వారి దగ్గర జ్ఞానం లేదు.. జ్ఞానం ఉన్నచోట భాష లేదు.. రెండూ ఉన్నచోట నైపుణ్యాలు లేవు.. అందువల్ల ఈ మూడిరటి కలబోతగా విద్య ఉండాలని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ విద్యా విధానం నివేదిక రూపకల్పనపై సెక్రటేరియట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో విద్యా రంగాన్ని సమూల ప్రక్షాళన చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గతంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు భూముల పంపకం… నిధుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టేవని.. ఇప్పుడు పంపకానికి భూములు, తగినన్ని నిధులు లేవని, అందువల్ల పేదరిక నిర్మూలనకు విద్య తప్ప మరో ఆయుధం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా రంగం ప్రాధాన్యతను గుర్తించినందునే ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ దేశంలో విశ్వ విద్యాలయాలు, ఐఐటీలు వంటి ఉన్నత విద్యా సంస్థలను స్థాపించారని గుర్తు చేశారు. సరళీకృత ఆర్థిక వ్యవస్థ అమల్లోకి వచ్చాక దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగినప్పటికీ విద్యాప్రమాణాలు ఆ స్థాయిలో పెరగకపోవడంతో వాటిని అందిపుచ్చుకోవడంలో మనం విఫలమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి ఏటా బయటకు వస్తున్న లక్షలాదిమంది ఇంజినీరింగ్ విద్యార్థుల్లో పది శాతం మందికి కూడా ఉద్యోగాలు దక్కడం లేదన్నారు. ఆ రంగంలో నైపుణ్యాలు పెంచడంతోపాటు ఇంకా పలు రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకునేలా విద్యా రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. మన చదువులు భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో ఉండాలన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఆధునిక పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నైపుణ్యాలు అందించే కోర్సులను అందించేందుకు ఐటీఐల్లో కోర్సులను మార్చామని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. రానున్న 25 ఏళ్ల వరకు విద్యా వ్యవస్థకు దిశానిర్దేశం చేసేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలన్నారు. మీరు రూపొందించే తెలంగాణ విద్యా విధానం దేశానికి దిక్సూచిలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మౌలిక వసతులు, ప్రమాణాల మెరుగుకు ఖర్చు చేయాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణ విద్యా విధానంలో సిలబస్ రూపకల్పన, వనరుల సమీకరణ, విధానం అమలుపై స్పష్టత అవసరమని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ విద్యా విధానంపై ఏర్పాటైన కమిటీ చైర్మన్ కేశవరావు మాట్లాడుతూ విద్యా కమిషన్, ఇతర భాగస్వాములతో తాము విస్తృత సంప్రదింపులు చేశామన్నారు. గణాంకాల కన్నా నాణ్యత ప్రధానమని, విద్యార్థి కేంద్రంగా బోధన ఉండాలనేది తమ అభిప్రాయమన్నారు. ఏఐ వంటివి ఎన్ని వచ్చినా అవి గురువుకు ప్రత్యామ్నాయం కావన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐ.వి.సుబ్బారావు, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి, ప్రొఫెసర్ హరగోపాల్ తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ పలు సూచనలు చేశారు. ప్రొఫెసర్ కోదండరాం కూడా మాట్లాడారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఎమ్మెల్సీలు ఎ.వి.ఎన్.రెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, విద్యావేత్తలు మోహన్ గురుస్వామి, ప్రొఫెసర్ సుబ్బారావు, సీఐఐ శేఖర్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, అక్షర వనం మాధవరెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఫ్రొపెసర్ గంగాధర్, విశ్రాంత ఐఏఎస్‌లు మిని మాథ్యూ, రంజీవ్ ఆచార్య, ప్రొఫెసర్ శాంతా సిన్హా తదితరులు మాట్లాడారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, అధికారులు జయేశ్ రంజన్, శ్రీదేవసేన, కృష్ణ ఆదిత్య, నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





