– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
– రెండేళ్ల పాలనలో పదేళ్ల ప్రగతి సావనీర్ ఆవిష్కరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8ః రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూడో వసంతంలోకి అడుగుపెట్టిందని, ఈ రెండేళ్లలో రాష్ట్రానికి ఒక స్పష్టమైన కొత్త దిశను చూపిస్తూ అభివృద్ధి–సంక్షేమాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ‘రైజింగ్ రేవంత్ రెడ్డి.. రెండేళ్ల పాలనలో పదేళ్ల ప్రగతి’పేరుతో స్పీక్ సంస్ధ రూపొందించిన సావనీర్‌ను గురువారం ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డితో కలలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నామని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో మరింత వేగంగా అభివృద్ధి, మరింత విస్తృతంగా సంక్షేమం అందేలా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రతి నిర్ణయంలో ప్రజలే కేంద్రబిందువుగా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని అన్నారు. పదేళ్లుగా నిర్లక్ష్యం, అవినీతి, అహంకార పాలనతో వెనుకబడ్డ తెలంగాణను తిరిగి గాడిలో పెట్టే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరించిందన్నారు. ప్రజల ఆకాంక్షలను విధానాలుగా మలుస్తూ మాటలు కాదు.. పనులే ప్రామాణికంగా పరిపాలన సాగిస్తున్నామని తెలిపారు. రెండేళ్లలోనే రైతులు, పేదలు, మహిళలు, యువత, దళితులు, గిరిజనులు, మైనారిటీలకు న్యాయం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నామని, సంక్షేమ పథకాలను కాగితాలకే పరిమితం చేయకుండా ప్రజలకు అందించామని మంత్రి వివరించారు. రెవెన్యూ శాఖ పరంగా భూ పరిపాలనలో పారదర్శకత తీసుకురావడం, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారాలు చూపడం, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఆధునిక సాంకేతికతతో సర్వే ప్రక్రియలను వేగవంతం చేయడం వంటి చర్యలు ప్రజలకు మేలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, స్పీక్ సంస్ద గౌరవ సలహాదారు అన్నే సత్యనారాయణ, అధ్యక్షుడు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





