– అమలులోకి రెండు ఫోటోలు
– సిగ్నల్ సమస్యతో మరింత ఆలస్యం
– ఫీల్డ్ అసిస్టెంట్లకు తప్పని తిప్పలు
– ఇలాగైతే పనికి రాలేమంటున్న కూలీలు
ములుగు, ప్రజాతంత్ర మార్చి 5: కేంద్రం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్ అమల్లోకి రావడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వేసవికాలం ప్రారంభం కావడంతో ఎండలకు కూలీలు తీవ్రంగా నీరసపడిపోతున్నారు. దీనికితోడు రెండు ఫొటోల విధానంతో మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో పనిచేసిన అనంతరం పదిమంది గ్రూపులోని పనికి వచ్చిన సభ్యుల ఫొటో తీసి అప్‌లోడ్ చేసేవారు. ప్రస్తుతం పనికి వచ్చిన వెంటనే ఒక్కో కూలీ ఫొటోను క్యాప్చర్ చేయాలి. పని పూర్తయిన తర్వాత మరోసారి గ్రూపులో ఉన్న అందరినీ కలిపి మరో ఫోటో తీయాల్సి వస్తోంది. దీనికి గ్రూపులోని సభ్యులందరూ మొదటిసారిగా ఫొటో దిగిన తర్వాత రెండో ఫోటో కోసం నాలుగు గంటల సమయం పడుతుంది. మేజర్ గ్రామపంచాయతీలలో సుమారు 200 మంది కూలీలు పని చేస్తే ఉదయం ఒక్క ఫొటోతో మొదలుకొని ఫీల్డ్ అసిస్టెంట్ వారందరి ఫొటోలు తీయడానికి కనీసం మూడు గంటల సమయం పడుతుంది. ఒకవేళ ఆన్లైన్ సమస్యలు ఎదురైతే ఫోటోలు పంపించడం కష్టమవుతోంది. ఉదయం 8 గంటలకు కూలీలు హాజరైన చివరి కూలీని ఫొటో తీయడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం అవుతుంది. కూలీలు పనిచేసిన అనంతరం రెండవ హాజరు 2గంటలకు మొదలుపెట్టినా సాయంత్రం 4గంటల నుంచి 6 గంటలు దాటుతోంది. వేసవి కావడంతో కూలీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. డూప్లికేట్స్ కు అడ్డుకట్ట వేయడం, అవకతవకలను అడ్డుకునేందుకు కూలీల ఫొటోను కాప్చర్ చేసి అప్లోడ్ చేసే విధానం ప్రారంభం కావడంతో దీనిని మొదటి రోజు అమలు చేయడం అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు తలకు మించిన భారంగా మారింది.
కూలీలు వచ్చేనా… అమలు సాధ్యమేనా
రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల పరిధిలో మొత్తం 53,98,235 మంది కూలీలు ఉన్నారు. కూలీల జాబ్ కార్డును గతంలోనే ఆధార్తో లింక్ చేయడంతో పాటు ఈ కేవైసీ విధానాన్ని అమలు చేశారు. ఒకరి స్థానంలో మరొకరు పని చేయడం, సగం పూట మాత్రమే పనికి రావడం వంటి వాటికి చెక్ పెట్టేందుకు ఉపాధి హామీ అసిస్టెంట్లు మస్టర్లో నమోదైన 10 మంది కూలీలను ఒకే చోట నిలబెట్టి వారి ఫోటో తీసి సంబంధిత యాప్‌లో అప్లోడ్ చేసేవారు. ఈపథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయడంతో పాటు నిజంగా వర్క్ సైట్‌కు వచ్చి నిర్దేశిత సమయం మేరకు పనిచేసిన కూలీలకే లబ్ధి చేకూరేలో కొత్తగా వ్యక్తిగత ఫొటో కాప్చర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానాన్ని సోమవారం నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. ఇందులోభాగంగా పని ప్రదేశానికి వచ్చిన ఒక్కో కూలీని వ్యక్తిగతంగా ఫొటో తీసి నేషనల్ మస్టర్ మెనేజ్మెంట్ సిస్టంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.. ప్రతి కూలీ ఫొటోను రెండు సార్లు తీయనున్నారు. ఉదయం 8 గంటలకు పని మొదలైన వెంటనే ఒకసారి, మధ్యాహ్నం 12 గంటల తర్వాత మరోసారి ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేయ నున్నారు. రెండు ఫొటోలు యాప్లో అప్లోడ్ అయితేనే కూలీలకు వేతనం అందనుంది. జియో కోఆర్డినేషన్ సిస్టం ఆధారంగా యాప్ పనిచేస్తుండడంతో రెండు ఫోటోలు దిగలేమంటూ మొదటి రోజు పనికి వచ్చిన కూలీలు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఉపాధి పనికి వచ్చే కూలీల సంఖ్య బాగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ సైతం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోటోలు తీసేందుకే సరిపోతుంది. పని ప్రదేశంలో కూలీల చేత పనిచేయడం మరోవైపు హాజరు రెండుసార్లు తీయడం పట్ల ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు కూలీలలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
ఫీల్డ్ అసిస్టెంట్లపై భారం తగ్గిస్తారా?
ములుగు జిల్లాలో ఈసారి రబీ పంట కాలంలో మిర్చి పత్తి వంటి పంటలు వేసిన రైతులు చాలా వరకు నష్టపోయారు దీంతో కూలీలకు ఉపాధి హామీ పథకం తప్ప వేరే దారి కనిపించడం లేదు. కూలీలు ఎక్కువగా హాజరైతే ఫీల్డ్ అసిస్టెంట్ లపై పని భారం ఎక్కువ అవుతుంది దీనికి తగ్గట్లుగా అధికారులు 50 మంది కూలీలకు ఒక వ్యక్తిని ఫీల్డ్ అసిస్టెంట్కు సహకరించేలా రెండుసార్లు ఫోటోలు తీసేందుకు యాప్ను ఇన్స్టాల్ చేయడంతో పాటు పని ప్రదేశంలో హాజరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే ఫీల్డ్ అసిస్టెంట్ ల పై పని ఫారం ఎక్కువగా ఉంటుంది. కూలీల హాజరు వేయడంతో పాటు మాస్టర్ లపై సంతకాలు తీసుకోవడం వాటిని పై అధికారులకు అప్పగించడం వంటి పనులతో పాటు కూలీలకు పని కల్పించేలా పనులను గుర్తించడం వంటి పనులు చేస్తున్నారు. నర్సరీల లో పనిచేయడం ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే మరుగుదొడ్ల నిర్మాణం ఇతర పనులను లబ్ధిదారులకు అందించడానికి నిరంతరం పనిచేయాల్సి వస్తోంది. దీనికి తగ్గట్లుగా వేతనాలు మాత్రం అందించడం లేదని వచ్చిన వేతనం కూడా సకాలంలో రావడంలేదని ఫీల్డ్ అసిస్టెంట్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కూలీల కష్టాలతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యలను పరిష్కరించేలా తగిన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




