‘స్థానిక‌’ ఎన్నిక‌ల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హిస్తాం

– నూత‌న డీజీపీ శిశ‌ధ‌ర్‌రెడ్డి
– గ‌వ‌ర్న‌ర్‌, సీఎస్‌ల‌ను క‌లిసిన డీజీపీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నూతన డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. డీజీపీగా లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమకు బలమైన జట్టు ఉంది.. క్షేత్రస్థాయిలో సాంకేతికతను వినియోగించుకుని మరింత సమర్థవంతంగా పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పోలీసు స్టేషన్ల సంఖ్య కంటే పోలీసుల్లో నైపుణ్యాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు శాఖ ప్రత్యేక విభాగాల్లోని 1700 ఖాళీలను నిపుణులతో భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. కాగా, పోరాట మార్గం వీడేందుకు సిద్ధమని ఇటీవల నక్సల్స్‌ లేఖ రాశారని, జనజీవన స్రవంతిలో కలవాలని వారిని కోరుతున్నామని, మావోయిస్టుల సిద్ధాంతాలు ఆచరణలో విఫలమయ్యాయని భావిస్తున్నామని అన్నారు. లొంగిపోయిన వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని డీజీపీ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో శివధర్‌ రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావును కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంటలిజెన్స్‌ విభాగం అడిషనల్‌ డీజీగా భాద్యతలు చేపట్టిన విజయ్‌ కుమార్‌ కూడా సీఎస్‌ రామకృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *