భక్తుల సౌకర్యార్థం నూతన కాటేజీ విధానం

– రూకల్పనకు టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశం

తిరుమల, ప్రజాతంత్ర, జులై 15: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వసతి కల్పించేందుకు నూతన కాటేజీ విధానాన్ని రూపొందించాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులన ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని తన చాంబర్‌లో అదనపు ఈవో సిహెచ్‌.వెంకయ్య చౌదరితో కలిసి అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా, దాతలు కాటేజీలు నిర్మించేందుకు వీలుగా విధానపరమైన బ్లూ ప్రింట్‌ను తయారు చేయాలన్నారు. అదే సమయంలో దాతలకు కేటాయించిన వారి అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడడం, దాతలకు కల్పించిన సౌకర్యాల నిర్వహణ, దాతల ఎంపిక,చ నిర్దేశించిన సమయానికి వారు కాటేజీలు నిర్మించి టీటీడీకి అప్పగించేలా, భక్తి భావం ఉట్టిపడేలా గదుల నిర్మాణం, వాటి నిర్వహణ, సుందరీకరణ, పచ్చదనం, పార్కింగ్‌, కాటేజ్‌ డిజైన్‌, కాటేజీలలో శ్రీవారి ఫొటో, పెయింటింగ్‌, తదితర అంశాలపై పారదర్శకంగా ఉండేలా సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా కాటేజీల నిర్మాణం స్థిరంగా, సమాన ప్రాతిపదికన నిర్మాణం, నిర్మాణ సమయంలో నిబంధనలను అతిక్రమిస్తే స్పష్టంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను ముందుగా అంచనా వేసుకుని నివేదిక రూపొందించాలని ఈవో కోరారు. అంతకుముందు నూతన కాటేజీల నిర్మాణానికి సంబంధించి విధానపరమైన అంశాలపై అదనపు ఈవో సిహెచ్‌.వెంకయ్య చౌదరి వర్చువల్‌ ద్వారా ఈవోకు వివరించారు. కార్యక్రమంలో రిసెప్షన్‌ శాఖ డిప్యూటీ ఈవో భాస్కర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *