రాష్ట్రంలో… కొత్త క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ

2030 నాటికి 20 వేల మెగావాట్ల పునరుత్పాదక శక్తి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర,డిసెంబర్‌ 25: హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్షాన్ని అందుకోడానికి, తెలంగాణ ప్రభుత్వం కొత్త క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీని ప్రతిపాదిస్తుందని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈమేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.  దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అని, వివిధ రంగాలలో విస్తరించి ఉన్న విభిన్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందని తెలిపారు. రాష్ట్రం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యాక్రమాలతో  తెలంగాణ గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 2023-24లో 15,623 మెగావాట్ల నుంచి 2027-28లో 20,968 మెగావాట్లకు,  2034-35లో 31,809 మెగావాట్లకు పెరుగుతుందని తెలిపారు.

విద్యుత్‌ అవసరాలు 2023-24లో 85,644 మిలియన్‌ యూనిట్ల నుంచి 2027-28 లో 1,15,347 మిలియన్‌ యూనిట్లకు, 2034-35లో 1,50, 040 మిలియన్‌ యూనిట్లకు చేరుకుం టుందని అంచనా వేస్తున్నట్లు భట్టి విక్రమార్క వివరించారు. తెలంగాణ రాష్ట్రం 2030 నాటికి స్వచ్ఛమైన, స్థిరమైన 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్షాన్ని అందుకోడానికి, వొచ్చే జనవరి 3వ తేదీన హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ లో పలు భాగస్వాములతో సమావేశం నిర్వహిం చనున్నట్టు తెలిపారు. దేశ, విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారని డిప్యూటీ సీఎం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *