మంచుకొండలను కూడా మండించిన నేపాలీ జెన్‌-జీ

“మూడోప్రపంచదేశాలలో తమకు గిట్టని ప్రభుత్వాలను కూలదోయడానికి అగ్రరాజ్యాలు, సైనికతిరుగుబాటు వంటి మార్గాలనే కాదు, ప్రజల తిరుగుబాట్లను కూడా ఆశ్రయిస్తాయి. తమకు వ్యతిరేకులైన సద్దాం హుస్సేన్‌ను, గడాఫీని ప్రజలపై నేరాలు చేసినవారిగా అభియోగాలు మోపి శిక్షించాయి. తాము రహస్యముఠాల ద్వారా చేయించే హత్యల కంటె, వీటికి హెచ్చు న్యాయబద్ధత ఉంటుందని ఆధిపత్యదేశాలకు తెలుసు. అట్లాగని, ప్రజల రాజకీయవ్యతిరేకతలన్నీ మూడోశక్తి సృష్టి అని అనలేము. తక్షణ పరిస్థితులకు, పరిణామాలకు స్పందించలేరని, కేవలం ఏ చారిత్రకశక్తుల చేతిలోనో కీలుబొమ్మలుగా మాత్రమే ఉంటారని భావించలేము. వివిధ సమాజాల సంఘర్షణాత్మక ప్రయాణాలు, అన్నిసార్లూ ప్రజాస్వామిక శక్తులతో మాత్రమే చెట్టపట్టాలు వేసుకుని సాగవు. ఒక్కోసారి తిరోగామి, ప్రతీప శక్తులతో కూడా ఆశ్చర్యకరమైన స్నేహాలు చేస్తాయి.”

k srinivas sannivesam article

నేపాల్‌ సంక్షోభం మీద వేల రకాల వ్యాఖ్యానాలు, విశ్లేషణలు వస్తున్నాయి. ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకున్న సంచలనాత్మక పరిణామం అది. నేపాల్‌లో జరిగినటువంటిది మనదేశంలో ఎందుకు జరగడం లేదు, జరిగితే బాగుండు, జరిగితే ఎట్లా, మరీ అంత అరాచకమా? వంటి భావావేశాలతో కూడిన ఆశావహ విచికిత్స, భయాందోళనలు ధ్వనించాయి. మనతో కయ్యం పెట్టుకున్న, మనతో పెడసరంగా ఉన్న, మన శత్రువువైపు మొగ్గిన – వారందరికీ తగిన శాస్తి జరుగుతోందని అల్పానందం అనుభవించేవారు కొందరయితే, మోదీగారి దౌత్యవ్యూహానికి ట్రంపే దిగివచ్చాడు, ఇప్పుడు నేపాలీ ఆందోళన కారులు మోదీ వంటి నేత కావాలని కోరుతున్నారు, ఇది కదా, భారతీయ శక్తి! అని మరికొందరు గర్విస్తున్నారు. తిరిగి రాచరికం కావాలని కోరుకుంటున్న వారితో సహా, లేతయవ్వనుల నుంచి మధ్యయవ్వనుల దాకా నడుంకట్టి కమ్యూనిస్టు, కాంగ్రెస్‌ మిశ్రమ ప్రభుత్వాన్ని కూలదోయడంలో ఒక సంకేతాత్మకతను చూస్తున్నవారు, కనిపిస్తున్న జనసందోహం వెనుక ఏవో కనిపించని కుట్రలున్నాయంటున్నవారు, చర్చను మరింత విస్తృతం చేస్తున్నారు.

నేపాల్‌ భూభౌగోళిక రాజకీయాల రీత్యా ఎంతో ముఖ్యమైన ప్రాంతం. ఒకవైపు చైనా, మరోవైపు అమెరికా. ఇటు ప్రాంతీయ పెద్దన్న భారత్‌, ఈ దేశంలో తమ ప్రభావాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాయి. ఈ శక్తులన్నిటి మధ్య నేపాల్‌ పాలకులు సమయానుకూలంగా ఎటో అటు మొగ్గి రక్షణ పొందుతున్నారు. ఒక రకంగా బహుముఖ ఒత్తిడి నేపాల్‌కు రక్షణగా కూడా పనిచేస్తున్నది. వ్యూహాత్మక స్వయంప్రతపత్తి (స్ట్రాటెజిక్‌ అటానమీ) అంటూ మన దేశం ప్రస్తుత విదేశాంగ విధానాన్ని పిలుస్తున్నట్టే, వాళ్లు తమది వ్యూహాత్మక స్వతంత్రత అని చెప్పుకుంటారు. భూసరిహద్దుల మధ్య బందీదేశంగా ఉన్ననేపాల్‌, ఎనభై శాతం దిగుమతులను భారత్‌ ద్వారానే పొందుతుంది. పెట్రోలియం ఉత్పత్తులు కూడా భారత్‌ గుండా రావలసిందే. స్నేహం కంటె ఆధిక్యభావం ఎక్కువ చూపిస్తున్నదన్న విమర్శ భారత్‌ పై నేపాల్‌కు ఎప్పటినుంచో ఉన్నది. ప్రజాభిమానం దండిగా కలిగిన రాజు బీరేంద్ర కూడా సాత్వికంగానే అయినా, భారత్‌ ధోరణిని అడ్డుకునేవారు. భారత్‌ తో సత్సంబంధాలు కోరుకున్న నేపాలీ కాంగ్రెస్‌ కూడా ఒకానొకప్పుడు ‘దేశప్రయోజనాలకే ప్రాధాన్యం’ అని స్పష్టం చేయవలసివచ్చింది. తరువాత కాలంలో ఆ దేశం చైనాకు దగ్గర కాసాగింది. సహజంగానే అమెరికాకు అది కంటగింపు అయింది. భారత్‌ కు కూడా ఆ మొగ్గు నచ్చలేదు. ఈ నేపథ్యంలో, నేపాల్‌ పరిణామాల వెనుక విదేశీ ప్రభావాలను ఊహించడం సహజమే. శ్రీలంక, బంగ్లాదేశ్‌ లలో ఈ మధ్యకాలంలో జరిగిన అధికారమార్పిడులకు ముందు జరిగిన పరిణామాలకు, నేపాల్‌ సంఘటలనకు పోలిక ఉండడం కూడా, వీటన్నిటిలోను ఒక నమూనా పనిచేస్తున్నదేమో అన్న అనుమానాలకు కారణం. జెన్‌-జి యువకులు కొందరు నరేంద్రమోదీ వంటి నాయకుడు కావాలని ఆకాంక్షించడం, తాత్కాలిక ప్రధానిగా ఎంపిక అయిన సుశీలా కర్కి, భారత ప్రధానికి ‘శెల్యూట్‌’ అని చెప్పడం, సైనికాధిపతి ప్రసంగిస్తున్నప్పుడు, రాజరికపు చిత్రపటాలు కనిపించడం- మరి కొన్నిఅన్వయాలకు దారితీస్తున్నది. కానీ, ఉద్యమకారులలో అత్యధికులు, వారు ప్రధాని పదవికి సూచించినవారు అందరూ లౌకికవాదులు, ప్రజాస్వామిక సంస్కరణలు కోరుకున్నవారే కావడం కూడా వాస్తవం.

అవినీతి, దుష్పరిపాలనలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలన్నీ పవిత్రమైనవి కావని కొందరు పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. మనదేశంలో యుపిఎ-2 హయాంలో అన్నాహజారే, అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆధ్వర్యంలో జరిగిన అవినీతి వ్యతిరేక పోరాటం, ఎటు దారితీసిందో, ఎవరికి లాభించిందో తెలిసిందే. ఆ నాటి ఉద్యమంలో ముఖ్యపాత్ర వహించిన యోగేంద్ర యాదవ్‌, బిజెపి ప్రభుత్వం రావడానికి పరోక్షంగా సహకరించినందుకు పశ్చాత్తాపం కూడా చెందారు. కానీ, కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం, అవినీతికి, విధానవైకల్యానికి ఆస్కారమిచ్చి, బాధ్యతారహితంగా వ్యవహరించిన విషయం విస్మరించలేము. దేశానికేకాదు, తనకు కూడా దీర్ఘకాలిక నష్టం చేసే పరిణామాలను గుర్తించలేక, కాంగ్రెస్‌ విఫలమైంది. సరైన ప్రత్యామ్నాయాలు లేనప్పుడు, అందుబాటులో ఉన్నవాటిని ప్రజలు వరిస్తే దాన్నిఎట్లా తప్పుపట్టగలము?

“సమస్య అక్కడైనా ఇక్కడైనా రాజ్యాంగం అమలుకు సంబంధించినది. కీలకం అంతా రాజ్యాంగంతో వ్యవహరించే పాలకులలోనే ఉంటుందని బాబా సాహెబ్‌ అంబేద్కర్ ఆనాడే హెచ్చరించారు. ప్రజాస్వామిక విలువలున్నాయి, ప్రాతినిధ్య వ్యవస్థలున్నాయి, కానీ, ప్రజలకు అనుభవంలోకి రావడంలేదు. జీవనసూచికల్లో మెరుగుదల లేకపోగా, ఆర్థిక, సామాజిక అంతరాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపినవారు, రాచరిక వ్యతిరేక పోరాటంలో కానీ, మావోయిస్టు సాయుధపోరాటంలో కానీ పాల్గొన్నవారు కాదు, కనీసం చూసినవారూ కాదు. రాచరికం కూలిపోయి, కొత్త వ్యవస్థ ఇంకా నిర్మాణదశలో ఉన్నప్పుడు తెలివిడిలోకి వచ్చినవారు. మార్పు కోసం సుదీర్ఘకాలం, పోరాటాలు వైఫల్యాల చట్రంలో నిరీక్షించడానికి భారతసమాజానికి ఉన్న అనుభవం ఇంకా నేపాల్‌ కు సమకూరలేదు. ఈ నూతన తరం యువకలు గట్టిగా నినదించేసరికి, వ్యవస్థ కుప్పకూలిపోయింది.”

మూడోప్రపంచదేశాలలో తమకు గిట్టని ప్రభుత్వాలను కూలదోయడానికి అగ్రరాజ్యాలు, సైనికతిరుగుబాటు వంటి మార్గాలనే కాదు, ప్రజల తిరుగుబాట్లను కూడా ఆశ్రయిస్తాయి. తమకు వ్యతిరేకులైన సద్దాం హుస్సేన్‌ను, గడాఫీని ప్రజలపై నేరాలు చేసినవారిగా అభియోగాలు మోపి శిక్షించాయి. తాము రహస్యముఠాల ద్వారా చేయించే హత్యల కంటె, వీటికి హెచ్చు న్యాయబద్ధత ఉంటుందని ఆధిపత్యదేశాలకు తెలుసు. అట్లాగని, ప్రజల రాజకీయవ్యతిరేకతలన్నీ మూడోశక్తి సృష్టి అని అనలేము. తక్షణ పరిస్థితులకు, పరిణామాలకు స్పందించలేరని, కేవలం ఏ చారిత్రకశక్తుల చేతిలోనో కీలుబొమ్మలుగా మాత్రమే ఉంటారని భావించలేము. వివిధ సమాజాల సంఘర్షణాత్మక ప్రయాణాలు, అన్నిసార్లూ ప్రజాస్వామిక శక్తులతో మాత్రమే చెట్టపట్టాలు వేసుకుని సాగవు. ఒక్కోసారి తిరోగామి, ప్రతీప శక్తులతో కూడా ఆశ్చర్యకరమైన స్నేహాలు చేస్తాయి.

ఇంతకూ నేపాల్‌ లో ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? నెత్తురోడ్చి రాచరికాన్ని కూలదోసిన తరువాత, పునర్నిర్మాణానికి కొత్త నాయకత్వం చిత్తశుద్ధి చూపకపోవడం, తక్షణ సమస్యలను చక్కదిద్ది, దీర్ఘకాలిక సార్వజనిక అభివృద్ధి కోసం దూరదృష్టితో కూడిన ప్రయాణాన్ని రూపొందించకపోవడం- ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. దేశం ఇంకా కుదరుకోకమునుపే, దురాశలు ఆవహించి కుటుంబాలకు, బంధువులకు, ఆశ్రిత కులీనులకు ప్రయోజనాలు కట్టబెట్టి, కొన్ని శ్రేణులకు విలాసజీవితాలను అందించడం ప్రత్యక్షంగా కనిపించే రోగలక్షణాలు కాగా, ఫ్యూడల్‌ వ్యతిరేక ఉద్యమాశయాలను తుంగలో తొక్కడం పునాదినేపథ్యంగా తెలుస్తోంది. ఒకనాటి విప్లవకారులయిన మావోయిస్టులు, కమ్యూనిస్టులు కూడా ఈ నేరంలో భాగస్వాములు కావడం ఒక నిస్పృహాత్మక విషాదం.

పదేళ్ల వయస్సు మాత్రమే ఉన్న నవరాజ్యాంగం నేపాల్‌ ది. భారత రాజ్యాంగం ప్రభావం దాని మీద గణనీయంగా ఉన్నది. అంతే కాదు, ఇటీవలి దశాబ్దాలలో ప్రపంచ ప్రజాస్వామిక ఉద్యమాల నుంచి ఉద్భవించిన అనేక విలువలను కూడా నేపాలీ రాజ్యాంగం పొందుపరచుకున్నది. ముఖ్యంగా, సమ్మిశ్రిత ప్రాతినిధ్యాన్ని అధికం చేసే అధికరణాలను రూపొందించుకున్నది. ప్రత్యక్ష, పరోక్షపద్ధతిలో నేపాలీ పార్లమెంటులో ప్రాతినిధ్యాలుంటాయి. మనలాగే అక్కడ కూడా రెండు సభలు, ఒకటి ప్రతినిధుల సభ, మన లోక్‌ సభ లాంటిది. మరొకటి జాతీయ అసెంబ్లీ, అది రాజ్యసభ వంటిది. ప్రతినిధుల సభకు రెండు రకాల ఎన్నికలుంటాయి, అభ్యర్థుల ఎన్నిక, పార్టీల ఎన్నిక. అనేక అభ్యర్థుల మధ్య పోటీలో నుంచి అధిక ఓట్లును పొందినవారు విజేతలయ్యే పద్ధతిలో 165 సీట్లు ఉంటాయి. అట్లాగే పార్టీలు పొందిన ఓట్ల నిష్పత్తి ప్రకారం వాటికి కేటాయించే సీట్లు 110 ఉంటాయి. పార్టీలు నామినేట్‌చేసే సీట్లకు కూడా రిజర్వేషన్లుఉంటాయి. పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు స్త్రీలకు వర్తింపజేస్తున్నారు. అలాగే, వివిధ సామాజికశ్రేణులకు రిజర్వేషన్లు ఉన్నాయి. ప్రత్యక్ష, దామాషాల మిశ్రమపద్ధతిలో ఎన్నికలు నిర్వహించడంలో మెరుగైన ప్రజాస్వామికత ఉన్నమాట నిజమే కానీ, ఇంకా బాల్యదశలోనే ఉన్న నేపాలీ ప్రజాస్వామ్యంలో ఈ సంస్కరణ, ప్రజాభిప్రాయం శకలీకరణ చెందడానికి, మిశ్రమప్రభుత్వాలకు కారణమైంది. గత దశాబ్దకాలంలో తొమ్మిది సార్లు ప్రధానమంత్రులు మారారు. నేపాల్‌ సంక్షోభానికి సుస్థిరతారాహిత్యం ప్రధానకారణమని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు.

అయినంత మాత్రాన, నేపాలీ రాజ్యాంగం బలహీనంగా ఉన్నట్టు కాదు. భారత ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌, నేపాల్‌ను ప్రస్తావిస్తూ, బలమైన రాజ్యాంగ నిర్మాణం ఉన్నందువల్ల భారత్‌ సురక్షితంగా ఉన్నదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. గవర్నర్లు, రాష్ట్రపతులు, శాసనవ్యవస్థల మీద వారి నిర్ణయాధికారం, వివాదాలమీద న్యాయస్థానాలకు ఉన్న పరిధి- వంటి అంశాల మీద కీలకంగా జరుగుతున్న విచారణలో, ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి బలమైన రాజ్యాంగం రక్షగా ఉన్నదని, దాన్ని అన్ని వ్యవస్థలూ బలహీనపరచకుండా నిలబెట్టుకుంటే వ్యవస్థకు ఒడిదుడుకులు రావని చెప్పడం ద్వారా, ప్రభుత్వానికి ఒక హెచ్చరిక వంటి సూచన చేయడం ప్రస్తుతం న్యాయవ్యవస్థకు అవసరమై ఉండవచ్చును కానీ, నేపాల్‌ సంక్షోభానికి రాజ్యాంగబలహీనతలు కారణమని చెప్పలేము. భారతదేశం ఇంకా మల్లగుల్లాలు పడుతున్న అనేక సంస్కరణలను ఆరంభంలోనే పొందుపరచుకున్న కొత్తతరం రాజ్యాంగం నేపాల్‌ ది.

సమస్య అక్కడైనా ఇక్కడైనా రాజ్యాంగం అమలుకు సంబంధించినది. కీలకం అంతా రాజ్యాంగంతో వ్యవహరించే పాలకులలోనే ఉంటుందని బాబా సాహెబ్‌ అంబేద్కర్ ఆనాడే హెచ్చరించారు. ప్రజాస్వామిక విలువలున్నాయి, ప్రాతినిధ్య వ్యవస్థలున్నాయి, కానీ, ప్రజలకు అనుభవంలోకి రావడంలేదు. జీవనసూచికల్లో మెరుగుదల లేకపోగా, ఆర్థిక, సామాజిక అంతరాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపినవారు, రాచరిక వ్యతిరేక పోరాటంలో కానీ, మావోయిస్టు సాయుధపోరాటంలో కానీ పాల్గొన్నవారు కాదు, కనీసం చూసినవారూ కాదు. రాచరికం కూలిపోయి, కొత్త వ్యవస్థ ఇంకా నిర్మాణదశలో ఉన్నప్పుడు తెలివిడిలోకి వచ్చినవారు. మార్పు కోసం సుదీర్ఘకాలం, పోరాటాలు వైఫల్యాల చట్రంలో నిరీక్షించడానికి భారతసమాజానికి ఉన్న అనుభవం ఇంకా నేపాల్‌ కు సమకూరలేదు. ఈ నూతన తరం యువకలు గట్టిగా నినదించేసరికి, వ్యవస్థ కుప్పకూలిపోయింది. అయితే, ప్రస్తుత తిరుగుబాటు కూడా కొన్ని వ్యవస్థల సర్దుబాటుకు, కొన్ని సంక్షేమ అభివృద్ధి చర్యలకు మాత్రమే అవకాశం కల్పిస్తుంది తప్ప, సుస్థిరమయిన పురోగతికి ఆస్కారం కల్పించదు. ఉద్యమానికి ఉన్న పరిమితమైన ఎజెండా అందుకు కారణం. ఆర్థికఅంతరాలను ప్రశ్నించడం కూడా యువకుల కార్యాచరణలో ముఖ్యమైనదే అయినప్పటికీ, వాటి పరిష్కారానికి కావలసిన సైద్ధాంతిక కార్యక్రమం ఏదీ జెన్‌-జీలకు ఉన్నట్టు లేదు.

నేపాల్‌ తిరుగుబాటు సన్నివేశం అనేక దృశ్యాలను ఆవిష్కరించింది. అవకాశాల పరుగులో, మీడియా వ్యసనంలో తలమునకలయ్యారని అనుకుంటున్న యువజనం ఆగ్రహ ముఖాన్ని ప్రదర్శించింది. రాజ్యానికి చిహ్నాలైన భవనాల మీద, వ్యక్తుల మీద వ్యక్తమైన విధ్వంసక, హింసాత్మక నిరసనలను ప్రపంచమంతా చూసింది. బహుశా, పాలకశ్రేణులను ఆ దృశ్యాలు క్షణకాలమైనా నిలువునా వణికించి ఉంటాయి. ఆవేశాలను దిగమింగుకుంటున్న నిస్సహాయప్రజలకు రాజకీయ ఫేంటసీలను అందించి ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *