నేపాల్‌లో రాజకీయ సంక్షోభం

– వరుసగా మంత్రుల రాజీనామాలు
– ఇప్పటికే ముగ్గురు రాజీనామా
– దేశం విడిచేందుకు ప్రధాని ఓలి సిద్దమైనట్లు వార్తలు

ఖాట్మాండు,సెప్టెంబర్‌ 9: ‌బంగ్లాదేశ్‌ ‌తరవాత ఇప్పుడు నేపాల్‌ ‌రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. హిమాలయ దేశం నేపాల్‌లో సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఆ దేశ యువత చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. వేలాదిమంది జనరేషన్‌ ‌జెడ్‌ ఆం‌దోళనకారులు సోమవారం దేశ రాజధాని కాఠ్మాండులో చేపట్టిన ఉద్యమం రణరంగాన్ని తలపించింది. ఈ నిరసనల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికిపైగా గాయపడ్డారు. యువత హింసాత్మక నిరసనల నేపథ్యంలో ఫేస్‌బుక్‌, ‌ట్విటర్‌, ‌వాట్సాప్‌ సహా 26 సోషల్‌ ‌మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధిస్తూ ఈ నెల 4న తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ నిరసనలు చల్లారలేదు. మరోవైపు రాజధాని సహా పలు ప్రధాన నగరాల్లో సైన్యం మోహరించింది. ఆ దేశ ప్రధాని కేపీ ఓలి రాజకీయ సంక్షోభంలో ఇరుక్కున్నారు. ఇప్పటికే పలువురు కేబినెట్‌ ‌మంత్రులు రాజీనామా చేశారు. హోంమంత్రి రమేష్‌ ‌లేఖక్‌ అధికారికంగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కేబినెట్‌ ‌సమావేశంలో లేఖక్‌ ‌తన రాజీనామాను ప్రధాని ఓలికి సమర్పించారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి రామ్‌నాథ్‌ అధికారి, ఆరోగ్య శాఖ మంత్రి ప్రదీప్‌ ‌పౌడేల్‌ ‌కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో నేపాల్‌లో రాజకీయ సంక్షోభం నెలకొనే పరిస్థితి తలెత్తింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని కేపీ ఓలి దేశం విడిచి పారిపోయేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. హిమాలయ ఎయిర్‌లైన్స్ అనే ప్రైవేట్‌ ‌సంస్థకు చెందిన ఫ్లైట్‌లో ఆయన దుబాయ్‌ ‌వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఆయన ఇప్పటికే ఉప ప్రధాన మంత్రికి తాత్కాలిక బాధ్యతలు కూడా అప్పగించినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఓలి వైద్య చికిత్స నిమిత్తం దుబాయ్‌ ‌వెళ్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.  రెండోరోజు మంగళవారం కూడా పెద్దఎత్తున యువత వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. ఉదయం 8.30 గంటల నుంచే పార్లమెంటు వెలుపల రోడ్లను, కలంకి వంటి ప్రాంతాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం మంగళవారం నేపాల్‌లోని భారత పౌరులకు కీలక సూచన జారీ చేసింది. భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనలో నేపాల్‌లోని పరిస్థితిని గమనిస్తున్నామని తెలిపింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలు, నిబంధనలను పాటించాలని తెలిపింది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు సహనంతో వ్యవహరించి, సమస్యలను శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నామని వెల్లడించింది. దీంతోపాటు మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. అత్యవసర ప్రయాణాలు తప్పించి నిరసనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది. శాంతియుత వాతావరణం తిరిగి నెలకొనేవరకూ జాగ్రత్తలు తీసుకోవాలని విదేశాంగ శాఖ కోరింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *