జూరాల రోప్ తెగిపోవడమే నిదర్శనం
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ విమర్శలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్ 26: ప్రాజెక్టుల నిర్వహణ కూడా రాకపోవడం వల్లే జూరాల ప్రమాదంలో పడిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. జూరాల రోప్ 9వ నంబర్ గేట్ తెగిపోవడం ప్రభుత్వ నిర్లక్షానికి నిదర్శనం అని అన్నారు. ఆయన డియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏటా వరద వస్తుందని తెలిసినా స్పిల్ వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయలేదని, మెయింటెనెన్స్ పనులు చేయించడంలో నిర్లప్తత స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జూరాలకు వరద ఉద్ధృతి దృష్ట్యా ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని సూచించారు. జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కెటిఆర్ కోరారు. జూరాల ప్రాజెక్టులోని 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడం కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. ఒక్క ఇటుక పేర్చడం కూడా చేతకాని ముఖ్యమంత్రికి కనీసం ఉన్న ప్రాజెక్టు నిర్వహణ కూడా రాకపోవడం వల్లే జూరాల ప్రాజెక్టు డేంజర్‌లో పడిందని ఆరోపించారు. ప్రతిఏటా వరద వస్తుందని తెలిసినా స్పిల్ వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయించడంలో రేవంత్ సర్కారు నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. జూరాలకు క్రమంగా వరద ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలని అన్నారు. ఇప్పటికే ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల ఎస్.ఎల్.బి.సి టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పెద్దవాగుకు గండిపడి 16 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, వ్టటెం పంప్ హౌజ్ మునిగిపోయిందని, సుంకిశాల రిటేనింగి వాల్ కుప్పకూలి వందల కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇప్పుడు జూరాల 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడంతోపాటు ఇతర గేట్ల రోప్‌లు బలహీనంగా ఉండటం ప్రాజెక్టును ప్రమాదంలోకి నెట్టిందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు ఎగువ నుంచి పెరుగుతున్న ఇన్ ప్లోలోను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పకడ్బందీగా వ్యవహరించాలని తెలిపారు. జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.





