– బీఆర్‌ఎస్ పాలనపై ప్రొఫెసర్ హరగోపాల్ ధ్వజం
సుబేదారి, ప్రజాతంత్ర, జూలై 13: బీఆర్‌ఎస్ పాలనలో విద్య, వైద్య రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, అభివృద్ధిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే నేడు రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు హరగోపాల్ అన్నారు. హనుమకొండ హరిత హోటల్‌లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఆధ్వర్యంలో అప్పుల ఊబిలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ- కారణాలు-పర్యవసానాలు-పరిష్కారాలు అనే అంశంపై మేధావుల సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హరగోపాల్ మాట్లాడుతూ సమర్థవంతమైన నాయకత్వం ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుందని, అయితే గత పాలకులు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పరిపాలన చేపట్టారని విమర్శించారు. సెంట్రల్ వర్సిటీ అర్థశాస్త్ర విభాగం పూర్వ ఆచార్యులు డి.నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రజలు రాజకీయ చైతన్యంతో మంచి పాలనా వ్యవస్థను నెలకొల్పుకోవాల్సిన పరిస్థితులు ముందున్నాయన్నారు. విధాన నిర్ణయాలు ప్రజల చేతిలో ఉండాలన్నారు. ప్రొఫెసర్, రమణమూర్తి, ప్రొఫెసర్ పురుషోత్తం, గెజిటెడ్ అధికారుల సంఘం ఉపాధ్యక్షుడు ఎ.జగన్మోహన్‌రావు, ప్రొఫెసర్ వెంకటనారాయణ మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా ఆర్థిక పరిస్థితులను గమనిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యుడు పుల్లూరు సుధాకర్ మాట్లాడుతూ గత పాలకులు తెలంగాణను అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశించారని, కానీ ఇందుకు విరుద్ధంగా పాలన కొనసాగించగా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఆ విధానాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ రాజకీయంగా తగిన బుద్ధి చెప్పారని అన్నారు. సదస్సులో తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు, మేధావులు తదితరులు పాల్గొన్నారు.





