– కంపెనీలు వెనక్కి.. యువతకు ఉద్యోగ సంక్షోభం
– బీఆర్‌ఎస్ హయాంలో 18 కంపెనీలు ఇప్పుడు 11 మాత్రమే
– ఇంటర్నెట్, నిర్వహణ లోపాలతో వెనుదిరుగుతున్న సంస్థలు
– 4 నెలలుగా సెక్యూరిటీ, సిబ్బందికి జీతాలు బకాయి
– అసెంబ్లీలో తీవ్రంగా మండిపడ్డ హరీష్ రావు
సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 26: సిద్దిపేట ఐటీ టవర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అసెంబ్లీలో తీవ్రంగా మండిపడ్డారు.ఐటీ రంగాన్ని హైదరాబాద్‌కే పరిమితం కాకుండా రెండో స్థాయి నగరాలకు విస్తరించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్‌తో పాటు సిద్దిపేటలో కూడా ఐటీ టవర్లు నిర్మించిందని తెలిపారు. సిద్దిపేట ఐటీ టవర్‌లో బీఆర్‌ఎస్ హయాంలో 18 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించగా, ప్రస్తుతం 7 కంపెనీలు వెనుదిరిగి కేవలం 11 కంపెనీలు మాత్రమే మిగిలాయని పేర్కొన్నారు. దీంతో స్థానిక యువత నిరుద్యోగ సమస్యలు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఐటీ టవర్‌లో ఇంటర్నెట్ బిల్లులు చెల్లించకపోవడంతో కనెక్టివిటీ సమస్యలు ఏర్పడినట్లు, నిర్వహణ బాధ్యతలు చేపట్టిన అవుట్‌సోర్సింగ్ సంస్థకు బిల్లులు చెల్లించకపోవడంతో స్వీపర్లు, వాచ్‌మెన్ సహా సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.గతంలో కంపెనీలను ఆకర్షించేందుకు 3 సంవత్సరాల ఉచిత అద్దె సౌకర్యం కల్పించామని, ప్రస్తుతం సంస్థలు స్థిరపడే దశలో ఉన్నందున మరో 3 సంవత్సరాలు అదే సౌకర్యాన్ని కొనసాగించాలని కోరారు.టూ-టైర్ నగరాల్లోని ఐటీ టవర్లను ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండటం దురదృష్టకరమని పేర్కొంటూ వెంటనే పెండింగ్ బిల్లులు, సిబ్బంది జీతాలు చెల్లించడంతో పాటు కొత్త కంపెనీలను ఆహ్వానించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
ఆరోగ్యశ్రీపై అబద్దాలు చెప్పే ప్రయత్నం
రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై ఎమ్మెల్యే హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ వేదికగా తమ గళాన్ని వినిపించేందుకు ప్రయత్నించినప్పటికీ మైక్ ఇవ్వకపోవడంపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైకులు కట్‌చేసి తాము చెప్పాలనుకున్న వాస్తవాలను సభ దృ ష్టికి తీసుకురాకుండా ప్రభుత్వం అడ్డుపడు తోందన్నారు. హరీశ్ రావు మాట్లాడుతూ.. ’ఆరోగ్యశ్రీ ఖర్చుల పెంపుపై ప్రభుత్వం గొప్పలు చెప్ప్పుకుంటోంది. 2014 జూన్ 2 నాటికి ఆరోగ్యశ్రీ కోసం నెలకు రూ.32 కోట్లు ఖర్చయ్యేవి. 2023 నాటికి ఇది రూ.68 కోట్లకు చేరుకుంది. కానీ.. ప్రభుత్వం రూ.89 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతోంది. జనాభా పెరుగుదల, వైద్య ఖర్చుల పెరుగుదల ద ష్ట్యా ఈ పెంపు సహజం, ఇందులో కాంగ్రెస్ కొత్తగా సాధించిన ఘనతేమీ లేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాతే ఆరోగ్యశ్రీ ఖర్చులు బాగా పెరిగిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి, పనులు చేపట్టిన ఆసుపత్రుల నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం జాప్యం చేస్తోంది. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ ఆస్పత్రులన్నీ పూర్తిగా ప్రజలకు మెరుగైన సేవలు అందేవి. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు మరింత అండగా నిలవాలనే ఉద్దేశంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎక్సైజ్ అదాయంలో వాటాను పెంచి నిధులను సమకూర్చింది’ అని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





