– హోం మంత్రి అమిత్‌షాకు కిషన్‌రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయని, హైదరాబాద్‌లో మూసీ నది, ఇతర కాల్వలు పొంగి పొర్లుతుండగా మరో రెండ్రోజులపాటు భారీ వర్ష సూచన అని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు పరిస్థితిని వివరించినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. సహాయక చర్యలకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు(ఎన్‌డీఆర్‌ఎఫ్)ను పంపాల్సిందిగా కోేరానన్నారు. దీనికి స్పందిస్తూ ఇప్పటికే ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉంచామని, అవసరమైతే ఆ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అదనపు బృందాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అమిత్ షా తెలిపారన్నారు. భారీ వర్షాలు, మరో రెండ్రోజుల వర్ష సూచన నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని నదీ తీర, వాగుల అంచున ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోందని, నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరినందున పరివాహక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారుల సూచనల ప్రకారం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు. ఈ వరద సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా అవసరమైన అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తామన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తాత్కాలికంగా ఆహారం, తాగునీరు, పాలు, అత్యవసర మందులు వంటి సహకారాన్ని బీజేపీ కార్యకర్తలు అందించాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.





