– అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోదీ
– ఎన్డీయే సమావేశంలో మోదీని సన్మానించిన ఎంపీలు
న్యూదిల్లీ, ఫిబ్రవరి 3: భారత్‌పై అమెరికా విధించిన సుంకాలపై ఎన్ని విమర్శలు వచ్చినా ఇంతకాలం సహనంగా ఉన్నందువల్లనే అమెరికాతో వాణిజ్య ఒప్పందం మనకు అనుకూలంగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. ఇది ఓ చరిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకుని ఓర్పు వహించామన్నారు. అమెరికాతో భారత్ కుదుర్చుకున్న చారిత్రక వాణిజ్య ఒప్పందంపై మంగళవారం జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. భారత్, అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని(ట్రేడ్ డీల్) ’ఈ శతాబ్దపు అతిపెద్ద ఒప్పందం’గా అభివర్ణించారు. ఇది అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత దేశ ప్రాముఖ్యతను మరింత పెంచుతుందని తెలిపారు. భారత్, అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ కారణంగా ఇరు దేశాల పరస్పర సుంకాలు ప్రస్తుతం ఉన్న 25 నుంచి 18 శాతానికి తగ్గాయని వెల్లడించారు. ప్రపంచ వ్యవహారాల్లో సమతుల్యతను కాపాడుకోవడంలో భారత దేశ పాత్ర మరింత పెరుగుతుందని ఎంపీలతో అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో కొంతమంది తీవ్ర నిరాశకు గురయ్యారని ప్రతిపక్ష పార్టీలనుద్దేశిస్తూ మోదీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, ఎగుమతులు పెరిగేందుకు ఈ ఒప్పందం ఎంతో ఉపకరిస్తుందన్నారు. సమావేశంలో ఎన్డీయే ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని సత్కరించారు. భారత్‌పై అమెరికా విధించిన సుంకాలపై ఎన్ని విమర్శలు వచ్చినా సహనంతో ఉన్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అగ్రరాజ్యంతో చేసుకుంటున్న ఈ ఒప్పందం అనుకూలమైన ఆర్థిక వాతావరణాన్ని సృష్టించిందన్నారు. వాణిజ్య చర్చలపై ప్రభుత్వ స్థిరమైన వైఖరికి ఇది నిదర్శనమన్నారు. ప్రపంచ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఎన్నో దేశాలు వాణిజ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ మాత్రం ప్రయోజనం పొందుతోందన్నారు. దేశంలో పారిశ్రామిక వృద్ధిని బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని మోదీ పేర్కొన్నారు. గత దశాబ్దకాలంలో దేశంలో చాలా మార్పులు వచ్చాయని, పలు సంస్కరణలు మంచి ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందని, ప్రపంచ వేదికలపై మన ప్రాబల్యం పెరిగిందని వెల్లడించారు. మరి కొన్నేళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తప్పకుండా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ట్రేడ్ డీల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓకే చెప్పిన నేపథ్యంలో ఒప్పందం కోసం ప్రధాని చేసిన కృషికి గాను ఈ సన్మానం చేశారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష, అధికారపక్ష సభ్యుల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కీలక భేటీ ప్రాధాన్యం సంతరించు కుంది. ఇందులో ప్రతిపక్షాల విమర్శలపై స్పందనలు, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





