రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి బాటలు

– 61 వేల మంది రైతులకు ఫార్మర్ కిట్ల పంపిణీ ప్రారంభం
– ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని రైతులకు పిలుపు
– 20 నుండి 22 వరకు రైతు మహోత్సవం : మంత్రి తుమ్మల

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయ ప్రాంగణం నుండి మంగళవారం నిర్వహించిన ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్ 86వ ఎపిసోడ్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంపిక చేసిన రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతులకు ప్రత్యేక ఫార్మర్ కిట్లను అందజేసి రాష్ట్రవ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుమందుల మితిమీరిన వాడకం వల్ల మానవ ఆరోగ్యం దెబ్బతినడమే కాక క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమవుతున్న తరుణంలో మన పూర్వీకులు ఆచరించిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులే రైతులకు, సమాజానికి క్షేమకరమని స్పష్టం చేశారు. రూ42 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు, దానిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 489 క్లస్టర్లు దాదాపు 61,125 ఎకరాలలో ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం సాగు విధానంలోకి తీసుకువచ్చే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు, అందుకు 61,125 మంది రైతులను ఎంపిక చేసి రైతు వేదికల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వీరికి ఫార్మర్ కిట్లను అందజేశారు. అంతేగాక వీరికి సాగులోచ మార్కెటింగ్‌లో తోడ్పడే విధంగా కృషి సఖిలను క్లస్టర్‌కు ఇద్దరు చొప్పన నెలకు రూ.5000 గౌరవ వేతనం ఇచ్చి నియమించినట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన బీజామృతం, జీవామృతం, దశపర్ణి వంటి జీవ ఉత్పాదకాలు స్వయంగా తయారు చేసుకోలేని రైతుల కోసం ప్రభుత్వం బీఆర్‌సీలను (జీవ ఉత్పాదక తయారీ కేంద్రాలు) ఏర్పాటు చేసుకోవడానికి ప్రోత్సహిస్తుందని, ప్రతి బీఆర్‌సీకి ఇందుకు రూ.లక్ష కేటాయించినట్లు తెలిపారు.

రైతు మహోత్సవానికి తరలిరండి]

ఈనెల 20, 21, 22 తేదీల్లో ప్రభుత్వం నర్మెటలో నిర్వహించనున్న రైతు మహోత్సవ కార్యక్రమానికి రైతులు భారీగా తరలిరావాలని మంత్రి పిలుపునిచ్చారు. 150కి పైగా స్టాల్స్, శాస్త్రవేత్తలతో ముఖాముఖి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన. కార్యక్రమం చివరి రోజున ఈనెల 22న న‌ర్మెట‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల జమ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుంటూ అధిక ఆదాయాన్ని గడించాలని ఆకాంక్షించారు. ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు కార్యక్రమంలో లక్ష్యానికి మించి 110% నమోదు చేసి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలచి కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.422.64 కోట్ల ప్రత్యేక ప్రోత్సాహకం పొందడంలో కీలక పాత్ర పోషించిన వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, సహాయ సంచాలకులు, జిల్లా వ్యవసాయ అధికారులను ఈ సందర్భంగా మంత్రి తుమ్మల అభినందించారు. ఈ కార్యక్రమంలో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్రమోహన్, సంచాలకుడు బి.గోపి తదితర అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *