– ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం
ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : రైతులు ప్రస్తుత పరిస్థితులలో ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా చేపట్టి వ్యవసాయాన్ని పూర్వస్థితికి తీసుకురావాలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని అన్మాస్ పల్లి గ్రామ సమీపంలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సి జి ఆర్ భారత్ బీచ్ స్వరాజ్ మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ వార్షిక విత్తన పండుగ రెండవ రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయరంగం సంక్షోభంలో ఉన్న ప్రస్తుత పరిస్థితిలో రైతులు పెట్టుబడి లేని లేదా పరిమిత పెట్టుబడి వ్యవసాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోదండరాం అన్నారు. పెట్టుబడి భారాన్ని తగ్గిస్తూ ఆదాయాన్ని పెంచుకునేలా వ్యవసాయం ఉండాలన్నారు. విద్య, వైద్యం ఖర్చులను ప్రభుత్వం భరించినప్పుడు మాత్రమే వ్యవసాయం పై ఆధారపడ్డ రైతుల జీవితాలు సుభిక్షంగా మారుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం సంక్షోభం లోకి నెట్టబడిన ప్రస్తుత పరిస్థితిలో ప్రకృతి వ్యవసాయం, దేశీ విత్తనాల సంరక్షణ ఎంతో కీలకమన్నారు. ఈ దిశగా ప్రభుత్వాలు తాగిన వ్యవసాయ విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన పెంచుకోవాలని రైతులను కోరారు. ప్రకృతి వ్యవసాయం అనేది ఒక ఎదురీత లాంటిదని, ఇందులో రైతులతో పాటు వినియోగదారులందరూ భాగస్వాములు కావాలని కరీంనగర్ జిల్లా ముల్కనూర్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ అన్నారు. శ్రీ వేణుగోపాల గోశాల కు చెందిన నిర్మల యోగాభారతి మాత మాట్లాడుతూ రుతు కాలాల ప్రకారం పండించే ఆహారం తీసుకుంటే ఆరోగ్యం మెరుగవ్వడంతో పాటు శ్రేష్టమైన మానవ జాతి నిర్మితమవుతుందన్నారు. జన్యు మార్పిడి విధానాలు ప్రకృతి ఇచ్చిన వాటిని నాశనం చేస్తున్నాయని, ప్రతి పంట రసాయనాలతో విషతుల్యం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విత్తన పండుగను సందర్శించిన పలువురు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ను ప్రశంసించారు. అతిథులను నిర్వాహకులు సత్కరించారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చైర్మన్ లీలా లక్ష్మారెడ్డి తదితరుల పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




