కార్మిక చట్టాలకు నిరసనగా బంద్‌

‌- రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళన

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 12:  కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగింది. రాష్ట్రంలో సమ్మెతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌కార్యాలయాలు, విద్యా సంస్థల్లో సేవలు నిలిచిపోయాయి. హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులు, కార్మికులు నిరసనలు నిర్వహించారు. సార్వత్రిక సమ్మెకు సహకరించాలని డ్రైవర్లు ఎక్కడికక్కడే బస్సులు, కార్లు, ఆటోలను అడ్డుకున్నారు. రోడ్డుపై వాహనాలను నిలువరించి ప్రయాణికులను దించేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలి నడకన తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ సమ్మెకు సహకరించాలని డ్రైవర్లు ప్రజలను వేడుకున్నారు. సమ్మె కారణంగా బ్యాంకింగ్‌, ‌బీమా, రవాణా రంగాలకు అంతరాయం ఏర్పడింది.  నారాయణగూడలో జరిగిన నిరసన కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి మరియు సీపీఐ(ఎం) తెలంగాణ కార్యదర్శి జాన్ వెస్లీ, ఇతర నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు కార్మిక చట్టాలతో భర్తీ చేయడం కార్మిక వ్యతిరేక నిర్ణయం అని వెంకట్ రెడ్డి ఆరోపించారు. పీఎస్‌యులను బలహీనపరిచి ఎంజీఎన్ఆర్ఈజీఏను భర్తీ చేసినందుకు కేంద్రంపై ఆయన విమర్శల దాడి చేశారు. సమ్మెను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద జరిగిన నిరసనకు హాజరైన పీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్, కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను బలహీనపరుస్తోందని, అదానీ – అంబానీ వంటి పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.

సమ్మె ప్రభావం : సింగరేణిలో పూర్తిగా నిలిచిన పనులు

పెద్దపల్లి: సింగరేణి రామగుండం ఏరియాలోని ఆర్జీ-3, అర్జీ-2, ఏపీఏ ప్రాంతాల్లో పర్మనెంట్‌, ‌కాంట్రాక్ట్ ‌కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. కార్మికుల ఐక్య సమ్మెతో పనులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను నాలుగు లేబర్‌ ‌కోడ్‌ ‌లుగా ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ కార్మికవర్గం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో బీఎంఎస్‌ ‌మినహా అన్ని కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. భూగర్భ, ఓపెన్‌ ‌కాస్ట్ ‌గనులలో కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. గోదావరిఖని 2వ బొగ్గు గని ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన చేపట్టారు. నాలుగు లేబర్‌ ‌కోడ్‌ ‌ల వల్ల కార్మికుల హక్కులను హరించి వేస్తుందని నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ  కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని, లేదంటే భవిష్యత్తులో కార్మికులకు మనుగడ ఉండదని అన్నారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న సింగరేణి బ్లాక్‌ ‌లను సింగరేణి సంస్థకు కేటాయించాలని డిమాండ్‌ ‌చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *