హైదరాబాద్‌లో చారిత్రక నాణేల జాతీయ సదస్సు

– బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: హైదరాబాద్‌ మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో చారిత్రక నాణేల సదస్సు నిర్వహణకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వారసత్వ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 11, 12 తేదీల్లో 107వ వార్షిక జాతీయ నాణేల సదస్సు , సెమినార్‌ను నిర్వహించనున్నారు. ఈ సదస్సు బ్రోచర్‌ను డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ సచివాలయంలో పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆవిష్కరించారు. న్యూమిస్మాటిక్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌ఐ) సహకారంతో తెలంగాణ వారసత్వ శాఖ సంయుక్తంగా ఈ ప్రతిష్ఠాత్మక సదస్సును నిర్వహిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తరువాత నాణేల అధ్యయనంపై ఇంతటి ముఖ్యమైన జాతీయ స్థాయి కార్యక్రమం హైదరాబాద్‌లో జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ నాణేల చరిత్ర ద్వారా రాష్ట్ర గొప్ప చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని దేశానికి చాటి చెప్పేందుకు ఈ సదస్సు దోహదపడుతుందన్నారు.

డిసెంబర్‌ 11, 12 తేదీల్లో సదస్సు\

జూబ్లీహిల్స్‌లోని డాక్టర్‌ ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో డిసెంబర్‌ 11, 12 తేదీల్లో రెండు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. దేశ నలుమూలల నుంచి విద్యార్థులు, స్కాలర్స్‌, పరిశోధకులు, న్యూమిస్‌మటిక్స్‌ నిపుణులు పాల్గొనే ఈ సదస్సు నాణేల చారిత్రక, సాంస్కృతిక, కళాత్మక ప్రాముఖ్యతపై చర్చించేందుకు ఒక వేదికగా ఉపయోగపడనుందని భావిస్తున్నారు. బ్రోచర్‌ ఆవిష్కరణలో పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, వారసత్వ శాఖ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ అర్జున్‌రావు కుతాడి, డిప్యూటీ డైరెక్టర్లు డాక్టర్‌ డి.రాములు, డాక్టర్‌ పి.నాగరాజు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *