– రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డికి ఆహ్వానం
– ప్రధాన రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంపై చర్చ
– ఫెడరలిజం భావం పెంపొందిస్తుందన్న కోమటిరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో ఈనెల 19,20 తేదీల్లో దిల్లీలో నిర్వహించనున్న జాతీయ చింతన్ శిబిరం-2025కు రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆహ్వానం అందింది. ఈ చింతన్ శిబిరం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. రహదారి మౌలిక వసతుల అభివృద్ధి, భూసేకరణలో డిజిటలైజేషన్, స్మార్ట్ రోడ్లు, రోడ్డు భద్రత, నాణ్యత ప్రమాణాల పెంపు వంటి అంశాలపై జరగనున్న చర్చలు రాష్ట్రాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. రాష్ట్రంలో రోడ్డు కనెక్టివిటీ, హైవే అభివృద్ధి, రోడ్డు భద్రత విషయంలో కేంద్రంతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. జాతీయ చింతన్ శిబిరంలో రాష్ట్రం చురుకైన పాత్ర పోషిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ అనుభవాలు, ఉత్తమ విధానాలను ఈ వేదికపై పంచుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విజన్-2047 తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని, ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర రోడ్ పాలసీని ఆవిష్కరించామని ఆయన గుర్తు చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, నేషనల్ హైవేలు పలు కారిడార్లు, మన్ననూరు – శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, ఎన్‌హెచ్ 65 హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి 8 లేన్లుగా విస్తరణ, భారత్ ఫ్యూచర్ సిటీ నుండి దక్షిణ భారత్‌లోని ప్రధాన నగరాలు అమరావతి, చెన్నై, బెంగళూరు, మచిలీపట్నం పోర్టుతోపాటు నాగపూర్‌కు హై స్పీడ్ హైవే, బుల్లెట్ ట్రైన్ కారిడార్ల నిర్మాణ విజన్‌తో పనిచేస్తున్నామని, అందుకు కేంద్ర సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు, సమన్వయం ద్వారా జఠిలమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మంత్రి కోమటి రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నితిన్ గడ్కరీ లేఖ ఫెడరల్ స్పూర్తికి నిదర్శనంగా నిలుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి లేవనెత్తే అంశాలపై పూర్తి అజెండా రూపొందించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



