– దేశ సేవలో ఎప్పుడూ ముందే
– ఆర్‌ఎస్‌ఎస్ ఒక సంస్థ కాదు..ఒక నిర్మాణాత్మక శక్తి
– శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ వెల్లడి
న్యూదిల్లీ, అక్టోబర్ 1: భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉన్న భారతదేశానికి చొరబాటుదారుల నుంచి ముప్పు పొంచి ఉందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వీరి వల్ల అంతర్గత భద్రతతోపాటు మత సామరస్యం ఆపదలో పడే అవకాశం ఉందన్నారు. బుధవారం న్యూదిల్లీలో బీఆర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.100 నాణెంతోపాటు పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ సేవలను ఈ సందర్భంగా ప్రశంసించారు. ఆర్‌ఎస్‌ఎస్ అనేది ఒక సంస్థ కాదని.. వ్యక్తిత్వ వికాసం ద్వారా దేశ నిర్మాణం కోసం పాటు పడే శక్తి అని అభివర్ణించారు. నేను అనే అహాన్ని వీడి.. మనం అనే సామూహిక భావన వైపు నడిపించే ప్రయాణమే ఆర్‌ఎస్‌ఎస్ అని వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనేక అనుబంధ సంస్థలు ఉన్నా.. వాటి అంతిమ లక్ష్యం ఒక్కటేనని.. జాతీయతే అగ్రస్థానమని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ అనుబంధ సంస్థల మధ్య వైరుధ్యాలు ఉండవని పేర్కొన్నారు. సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ దేశ నిర్మాణంతోపాటు స్వాతంత్య్ర పోరాటం కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. ఇక స్వాతంత్య్రం అనంతరం ఆర్‌ఎస్‌ఎస్‌పై అనేక దాడులు జరిగాయని.. వాటన్నింటినీ తట్టుకుని నిలబడిందని ప్రధాని మోదీ తెలిపారు. శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న ఆర్‌ఎస్‌ఎస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్ కృషి చేస్తోందన్నారు. అసత్యంపై సత్యం, అన్యాయంపై న్యాయం, అధర్మంపై ధర్మం గెలుస్తుందన్నారు.’నది తన ప్రవాహంతో అనేక భూముల్లో పచ్చదనం పెంచుతుంది.నదీ ప్రవాహంలా ఆర్‌ఎస్‌ఎస్ కూడా ప్రజలకు సేవ చేస్తోంది. విద్య, వైద్యం, రైతులకు అనేకవిధాలుగా సంఘ్ సేవలు అందిస్తోంది. మన సంస్క•తి, సంప్రదాయాల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ చేసే ప్రతి పనిలో నేషన్ ఫస్ట్ అనేది కన్పిస్తోంది. గతంలో సంస్థ స్ఫూర్తిని అణచివేసేందుకు తప్పుడు కేసులు బనాయించడం, నిషేధించడం వంటి అనేక ప్రయత్నాలు జరిగాయి. అయినా ఆర్‌ఎస్‌ఎస్ అన్నింటినీ తట్టుకొని నిలబడింది’ అని మోదీ పేర్కొన్నారు. అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ ఈ సంస్థ నేటికీ బలంగా నిలబడిందన్నారు. అవిశ్రాంతంగా దేశానికి, సమాజానికి సేవ చేస్తోందన్నారు. వారి ప్రయత్నాలు దేశంపై ఉన్న భక్తి, త్యాగం, నిబద్దతకు నిదర్శనమన్నారు. తాజాగా విడుదల చేసిన రూ.100 నాణెంపై ఓవైపు జాతీయచిహ్నం.. మరోవైపు భారతమాత చిత్రం ఉంటుందన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన కరెన్సీపై భరతమాత ఉండటం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఏడాది స్వాతంత్య ్రదినోత్సవం సందర్భందా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయులను చొరబాటుదారుల నుంచి రక్షించేందుకే డెమెగ్రఫిక్ మిషన్ చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.అదీకాక వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వరుసగా మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ముస్లింలు అధికంగా ఉన్న బంగ్లాదేశ్ నుంచి ఓట్ల కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ చోరబాటుదారులను ప్రోత్సహిస్తున్నారని ప్రధాని మోదీ గతంలో విమర్శించిన విషయం విదితమే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




