ఏసీబీకీ చిక్కిన నార్నూర్ ఏఈ శ్రీకాంత్ డిస్మిస్

– అవినీతికి పాల్పడితే కటకటాలే.. బ్లాక్ లిస్టులో వివరాలు
– హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడి లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల ఔట్ సోర్సింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ దుర్గం శ్రీకాంత్‌ను ఉద్యోగంలో నుంచి తొలగించామని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతం తెలిపారు. ఇతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు, భవిష్యత్తులో ఎక్కడా ఉద్యోగం రాకుండా వివరాలను బ్లాక్ లిస్టులో పెడుతున్నట్లు ప్రకటించారు. నార్నూర్‌లో ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి మంగళవారం లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారన్నారు. బిల్లుల విడుదల నిమిత్తం ఇండ్ల ఫొటోలు అప్‌లోడ్ చేయడానికి అధికారులెవరైనా నిరాకరిస్తే ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా లబ్ధిదారులే స్వయంగా ఫొటోలను అప్‌లోడ్ చేసుకోవచ్చని ఎండీ సూచించారు. లబ్దిదారులు తమ మొబైల్ ఫోన్ లో ఇందిరమ్మ ఇండ్ల యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో తమ ఫోన్ నెంబరుతో (ఓటీపీ ద్వారా) లబ్ధిదారుగా లాగిన్ అయిన తరువాత డ్యాష్ బోర్డులో వారికి సంబంధించిన వివరాలన్నీ కనిపిస్తాయి. ఇంటికి సంబంధించి ‘క్యాప్చర్ స్టేజ్ వైజ్ ఫొటోగ్రాఫ్స’ అని ఇంటి నిర్మాణపు దశలు ఉంటాయి. అందులో గ్రౌండింగ్, బేస్‌మెంట్, వాలింగ్, శ్లాబ్ లెయిడ్, కంప్లీషన్ అని ఉంటాయి. వాటిలో ఏ దశ ఫొటోలు అప్ లోడ్ చేయాల్సి ఉంటుందో దానిపై క్లిక్ చేసి ఆ దశకు తగినట్లుగా నిర్దేశించిన వివరాలను పొందుపరచవచ్చని తెలిపారు.

అవినీతిని ఉపేక్షించేది లేదు..

పేదలకు శాశ్వతమైన లబ్ది చేకూర్చే బృహత్తరమైన సంక్షేమ కార్యక్రమంలో అవినీతికి పాల్పడుతూ లంచాలను డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎంతటి వాÂరినైనా ఉపేక్షించేది లేదని ఎండీ గౌతం హెచ్చరించారు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వారు జైలుకు వెళ్లడమే కాక తదుపరి వారికి ఎక్కడా ఉద్యోగాలు లభించవని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో వివిధ రకాల విధులు నిర్వర్తిస్తున్న రెగ్యులర్ సిబ్బంది అయినా, డిప్యుటేషన్‌పై వచ్చిన వారైనా, ఔట్ సోర్సింగ్ సిబ్బంది అయినా అవినీతికి పాల్బడితే కేసులు ఎదుర్కోవాల్సిందేనన్నారు. ఈ అంశంలో ప్రజలకు ఏమైనా ఫిర్యాదులుంటే 1800 599 5991 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *