22న నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

• రైతు ఉత్సవాలకు ముస్తాబు
• ప్రదర్శన శాలలను ప్రారంభించనున్న మంత్రి తుమ్మల
• ఇప్ప‌టికే ప్ర‌ముఖుల‌కు ఆహ్వానాలు
• ఏర్పాటు కానున్న 150 స్టాల్స్

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 18 : రాష్ట్ర సిగలో మరో మణిహారంగా నిలిచే నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ నెల 22న ఘనంగా ప్రారంభంకానుంది. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా ప్రజా ప్రతినిధులందరికీ ఆహ్వానాలు అందజేసినట్టు తెలిపారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వం నిర్వహించే రైతు ఉత్సవాల కోసం నర్మెట్ట కర్మాగార ప్రాంతం ముస్తాబు అవుతోంది. ఉగాది పర్వదినాన సాయంత్రం 4 గంటలకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల ప్రదర్శన శాలలను ప్రారంభించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి గార్లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఈ రైతు మహోత్సవంలో వ్యవసాయం, పశుసంవర్ధక , అనుబంధ రంగాలకు సంబంధించిన మొత్తం 150 స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖల విభాగాలు, విశ్వవిద్యాలయాలు, బ్యాంకులు, ఎఫ్.పి.ఓలు, స్టార్టప్ కంపెనీలు మరియు ప్రైవేట్ సంస్థలు తమ ఆధునిక సాంకేతికతలు, సేవలు, అవకాశాలను రైతులకు పరిచయం చేయనున్నాయి. బ్యాంకులు, ఎఫ్.పి.ఓలు, స్టార్టప్‌లు, ప్రైవేట్ కంపెనీల నిపుణులు, శాస్త్రవేత్తలతో రైతులు నేరుగా ముఖాముఖి చర్చించే ప్రత్యేక వేదికను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రైతు ఉత్సవం ఈ నెల 22 వరకు కొనసాగుతుంది. ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖ శాస్త్రవేత్తలు, అనుబంధ శాఖల అధికారులు, అవార్డు గ్రహీతలు,అభ్యుదయ రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించ‌నున్నారు. ఈ నెల 22న సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి  నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించి రైతన్నలకు అంకితం చేయనున్నారు. అదే రోజున ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ దగ్గర 80 కోట్లతో నిర్మించే రిఫైనరీ యూనిట్ కి శంకుస్థాపన కూడా చేయనున్నారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు రైతులతో వ్యవసాయరంగంలోని కీలక అంశాలపై ప్రత్యక్షంగా ముఖాముఖి మాట్లాడనున్నారు. అలాగే ఈ వేదిక నుండే ముఖ్యమంత్రిగారు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. నర్మెట్టలో ప్రారంభమవుతున్న ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రైతులకు మైలురాయిగా నిలవనుంది. దీని ద్వారా ఆయిల్ పామ్ రైతుల  సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గి, రైతుల ఆదాయం పెరుగుటకు దోహదపడనుంది. రైతులు, ప్రజా ప్రతినిధుల విజ్ఙప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి మద్ధతు లేకపోయిన గత ఖరీఫ్ లో మొక్కజొన్న కొనుగోళ్లు చేసినట్లు, ఈ యాసంగి కూడా ప్రభుత్వం కొనుగోళ్లు చేయడానికి సిద్ధంగా ఉందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.

రైతు మేళాకు నర్మెట రెడీ :  150 స్టాళ్లతో విస్తృత ఏర్పాట్లు 

సిద్దిపేట: నర్మెట్టలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, రైతు మేళా నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ హైమావతి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారులతో కలిసి ఫ్యాక్టరీని సందర్శించిన కలెక్టర్ హెలిప్యాడ్ ఏర్పాటు, బహిరంగ సభా ప్రాంగణం, రైతు మేళా కోసం సిద్ధం చేస్తున్న 150 స్టాళ్లను పరిశీలించారు. ఈనెల 19న మంత్రులచే ప్రారంభమయ్యే రైతు మేళాలో వ్యవసాయ, హార్టికల్చర్, పశుసంవర్ధక, మార్క్‌ఫెడ్, ఫిషరీస్, నాబార్డ్, విజయ డైరీ, బ్యాంకింగ్, సహకార రంగాలకు చెందిన మొత్తం 150 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. రైతులకు ఉపయోగకరమైన పరికరాలు, నమూనాలు, లైవ్ స్టాక్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 22వ తేదీ వరకు కొనసాగనున్న ఈ రైతు మేళాకు ప్రతిరోజూ 3,000 నుంచి 5,000మంది రైతులు హాజరవుతారని అంచనా. దీనికి తగిన విధంగా తాగునీరు, పారిశుధ్యం సౌకర్యాలు అన్నీ సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించే లక్ష్యంతో ఈ మేళాను రాష్ట్రస్థాయి కార్యక్రమంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి, ఉద్యానవన అధికారి సువర్ణ, పశుసంవర్ధక శాఖ అధికారి కొండల్ రెడ్డి, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *