– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
– శిల్పా పార్క్ అపార్టుమెంట్స్ వాసులతో ఆత్మీయ సమ్మేళనం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: మహిళా సాధికారత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన నారీశక్తి వందన్ అధినియం ఒక చరిత్రాత్మక నిర్ణయమని, దీని ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభిస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. 2029 ఎన్నికల నుంచి రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని చెప్పారు. కొండాపూర్‌లోని శిల్పా పార్క్ అపార్టుమెంట్ నివాసితులతో బుధవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరగనుందని, ప్రస్తుతం జరుగుతున్న ఓటరు లిస్టు శుద్ధి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అనేది కేంద్రం నిర్ణయం కాదని, భారత ఎన్నికల సంఘం అమలు చేస్తున్న విధానమని, 2002 నుంచి ఇప్పటివరకు పెద్దస్థాయిలో ఈ ప్రక్రియ జరగలేదని, ఈ కాలంలో చాలామంది ఓటర్లు వేరే చోటకు మారడం, మరణించడం వంటి కారణాలతో లిస్టులో లోపాలు ఏర్పడ్డాయని అన్నారు. వీటిని సరిచేయడానికి ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు చేర్పులు చేస్తున్నదని చెప్పారు. అందువల్ల ప్రతి ఓటరు తమ వివరాలను సరిచేసుకోవడం చాలా అవసరమని అన్నారు. లిస్టుల్లో తప్పుల వల్ల ఓటింగ్ శాతం పడిపోతోందన్నారు. మరోవైపు హైదరాబాద్ పాత బస్తీ ప్రాంతాల్లో ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లు నమోదై ఉండటం వంటి అనుమానాస్పద అంశాలు, కొన్ని ప్రాంతాల్లో రోహింగ్యాలు అక్రమంగా ప్రవేశించి స్థానికంగా ఎంఐఎం మద్దతుతో ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు పొందినట్లు చూస్తూనే ఉన్నామని, అందుకే డిటెక్టు-డిలీట్-డిపోర్టు అనే లక్ష్యంతో ‘సర్’ ప్రక్రియ చాలా అవసరమని ఆయన అన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఈ ప్రక్రియలో పాల్గొన్నారని, తెలంగాణలో కూడా ఇది వేగవంతం కావాలని చెప్పారు. ఒకచోట 500 నుండి 800 ఓట్లు ఉంటే ఆ ప్రాంతంలోనే పోలింగ్ బూత్ ఏర్పాటు చేసే అవకాశముంటుందన్నారు. కాగా, ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు 17% నుండి 50% వరకు పెరిగినప్పటికీ దేశంలో ధరలను పెంచకుండా, కొరత లేకుండా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు. భారత్ ప్రపంచవ్యాప్తంగా బలమైన దౌత్య సంబంధాలు కలిగి ఉన్నందున మోదీ నాయకత్వంలో దేశం సురక్షితంగా, ప్రశాంతంగా, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని రామచందర్‌రావు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





