నరేంద్ర కీర్తి అజరామరం

– నగరంలో కాషాయ జెండా రెపరెపలు ఆయన చలవే
– వర్ధంతి కార్యక్రమంలో రామచందర్‌రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: నగరంలో ఈరోజు కాషాయ జెండా రెపరెపలాడుతోందంటే, వేలాదిమంది కార్యకర్తలు ధైర్యంగా పనిచేస్తున్నారంటే అది ఆలె నరేంద్ర స్ఫూర్తితోనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. నరేంద్ర (టైగర్ నరేంద్ర) 12వ వర్ధంతి సందర్భంగా ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని, హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామచందర్ రావు నరేంద్ర చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈరోజు భాగ్యనగర హిందూ గుండె చప్పుడు, సింహ గర్జన, ‘టైగర’ నరేంద్ర వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. నరేంద్ర అంటే అన్యాయంపై బిగిసిన పిడికిలి, హిందూ ధర్మ రక్షణ కోసం కదం తొక్కిన ధైర్యం అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంఐఎంను రెచ్చగొడుతుండగా పాత బస్తీలో హిందువుల మీద దాడులు జరుగుతున్న సమయంలో నేనున్నానంటూ గర్జించిన ఏకైక నాయకుడు నరేంద్ర భాయ్ సాహబ్ అని గుర్తు చేశారు. మత కల్లోలాల సమయంలో ప్రాణాలకు తెగించి మజ్లిస్ గూండాల దాడులను ఎదుర్కొని, హిందువుల మానప్రాణాలను రక్షించారన్నారు. కేవలం ధర్మం కోసమే కాదు.. తెలంగాణ ఆత్మగౌరవం కోసం కూడా నరేంద్ర పోరాడారని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక పార్టీ పెట్టి ముందుండి ఉద్యమం నడిపిన యోధుడని కొనియాడారు. కార్మికుల పాలిట పెన్నిది అంటూ కాగజ్‌నగర్ మిల్స్ దగ్గర నుండి హైదరాబాద్‌లోని అల్విన్ కంపెనీ వరకు అనేక పరిశ్రమల్లో ట్రేడ్ యూనియన్ లీడర్‌గా కార్మికుల హక్కుల కోసం అహోరాత్రులు పోరాడారని చెప్పారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. హైందవ సంస్కృతి పరిరక్షణ కోసం ఆయన చూపిన పోరాట పటిమ మనందరిలో నిండాలని, రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై రామరాజ్యం స్థాపించే వరకు మన పోరాటం ఆగదని, ఆయన చూపిన బాటలో నడుస్తూ బీజేపీని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దామని రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
——————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *