నంబర్ ప్లేట్లపై ‘నేమ్ బోర్డుల’ హంగామాకు చెక్?

 – రాజ్యమేలుతున్న కుల సంఘాల గుర్తులు
– ఆదేశాలు సరే, అమలు ముఖ్యం
– » అధికార్లు నిష్పక్షపాతంగా అమలు చేయాలి
– అప్పుడే ఆశించిన ఫలితం

                                                                                                   (హైదరాబాద్, ప్రజాతంత్ర)

తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ తాజాగా జారీ చేసిన మెమో రాష్ట్రవ్యాప్త రవాణా వ్యవస్థలో ఒక సంచలనానికి, అంతకు మించిన చర్చకు తెరలేపింది. వాహనాల నంబర్ ప్లేట్లపై లేదా బాడీపై అనధికారికంగా హోదాలను, వృత్తిపరమైన చిహ్నాలను ప్రదర్శించడంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని
నిర్ణయించింది. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 50, 51 నిబంధనల ప్రకారం, వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్ అనేది కేవలం ఆ వాహన గుర్తింపు సంఖ్యను ప్రతిబింబించే ఒక చట్టఐ ద్ధమైన సాధనం మాత్రమే. కానీ, నేడు మన రహదారులపై ఆ ప్లేట్లు అధికార ప్రదర్శనకూ, సామాజిక హోదాకూ ప్రదర్శన వేదికలుగా మారిపోయాయి.
అడ్వకేట్, ప్రెస్, పోలీస్, ఆర్మీ వంటి వృత్తిప రమైన గుర్తులు ఒకెత్తయితే ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి రాజకీయ పదవుల హంగామా మరో ఎత్తు. వీటికితోడు కుల సంఘాల పేర్లు, ‘గౌడ్స్ జాబ్స్’ వంటి సామాజికవర్గ గుర్తింపులు కూడా వాహనాలపై రాజ్యమేలుతున్నాయి. ఈ నేపథ్యంలో హై కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్దతను కాపాడటంతోపాటు సామాన్యుడికి, పాలకుడికి మధ్య ఉన్న అదృశ్య విభజనను తొలగించడానికి ఒక సాహసోపేతమైన అడుగుగా భావించవచ్చు. అయితే ఈ నిబంధనల అమలు ప్రక్రియలో ఒక స్పష్టమైన వైరుధ్యం, నైతిక సందిగ్ధత నెలకొంది. చట్టం కాగితం మీద అందరికీ సమానమే అని ఉద్ఘాటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో దాని అమలు తీరుపై సామాన్య పౌరుల్లో ప్రబలమైన అనుమానాలు ఉన్నాయి.

తొల‌గించే ధైర్యం చేయ‌గ‌ల‌రా?

సాధారణ పౌరుడు తన వాహనంపై ఏదైనా చిన్న స్టిక్కర్ వేసుకుంటే వెనువెంటనే జరిమానా అస్త్రం ప్రయోగించే యంత్రాంగం, మరి అధికార యంత్రాంగంలో భాగమైన పోలీస్, ఆర్మీ, కలెక్టరేట్ వంటి బలమైన విభాగాల ఉద్యోగుల విషయంలో అదే కఠినత్వాన్ని, నిష్పాక్షికతను ప్రదర్శించగలదా అన్నదే అసలు ప్రశ్న. ఒక సామాన్య ట్రాఫిక్ కానిస్టేబుల్ తన పైఅధికారి ప్రైవేటు వాహనాన్ని ఆపి, నంబర్ ప్లేట్‌పై ఉన్న ‘పోలీస్’ ముద్రను తొలగించమని ఆదేశించే నైతిక స్థైర్యాన్ని కలిగి ఉంటాడా? లేదా ఒక ప్రభావశీల రాజకీయ నాయకుడి వాహనంపై ఉన్న ఎంపీటీసీ, సర్పంచ్ బోర్డులను తొలగించే ధైర్యం రవాణా శాఖకు ఉందా? నిజానికి ఈ హోదాల ప్రదర్శన అనేది కేవలం వృత్తిపరమైన గుర్తింపు కోసం మాత్రమే కాదు, అదొక ‘అప్రకటిత మినహాయింపు’  పొందే సాధనంగా మారిపోయింది. ట్రాఫిక్ ఉల్లంఘనల నుండి సులభంగా తప్పించుకోవడానికి, టోల్ ప్లాజాల వద్ద చట్టవిరుద్ధమైన వెసులుబాటు పొందడానికి, లేదా సమాజంలో ఒక రకమైన భీతిని కలిగించి గౌరవాన్ని ఆశించి ఈ గుర్తులను వాడుతున్నారు. చట్టపరంగా ‘ఇంపర్సనేషన్’ అంటే తగిన అర్హత లేకపోయినా ఒక హోదాను ఆపాదించుకోవడం తీవ్రమైన నేరం. ఉదాహరణకు, అధికారిక అక్రిడిటేషన్ లేని వారు ‘ప్రెస్’ అని రాసుకోవడం వల్ల నిజమైన జర్నలిస్టుల విశ్వసనీయత దెబ్బతినడమే కాకుండా, పోలీసు విచారణలకు కూడా విఘాతం కలుగుతుంది. అదేవిధంగా, కాలం చెల్లిన మాజీ పదవులను కూడా ప్రస్తుత హోదాల వలె ప్రదర్శించడం ప్రజలను తప్పుదారి పట్టించడమే అవుతుంది.

ఉన్నతస్థాయి నుండే ప్రారంభం కావాలి

ఈ సంస్కరణ విజయవంతం కావాలంటే మార్పు అనేది అధికారిక సోపాన క్రమంలో ఉన్నత స్థాయి నుండే ప్రారంభం కావాలి. ప్రభుత్వమే ఒక చట్టబద్ధమైన ఆదర్శంగా నిలిచి, తన సచివాలయాలు, కలెక్టరేట్ పార్కింగ్ స్థలాల్లో ఉన్న అధికారుల ప్రైవేటు వాహనాలపై ఉన్న అనధికారిక లోగోలను ముందుగా తొలగింపజేయాలి. ప్రజా ప్రతినిధులు తామే స్వచ్ఛందంగా తమ వాహనాలపై ఉన్న అదనపు బోర్డులను తొలగించుకుని ‘చట్టం ముందు అందరూ సమానమే’ అన్న రాజ్యాంగ సూత్రానికి కట్టుబడి ఉండాలి. కులాల పేర్లు లేదా సామాజిక వర్గాల గుర్తింపులు రహదారిపై ప్రయాణించేటప్పుడు అనవసరమైన వర్గ విభేదాలకు, సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యంలో రహదారిపై వెళ్తున్న ప్రతి పౌరుడూ సమానమే. రాష్ట్రం ఒక క్రమశిక్షణతో కూడిన, పారదర్శకమైన రవాణా వ్యవస్థను నిర్మించాలనుకోవడం అభినందనీయం. కానీ, ఈ నిబంధనల అమలులో ‘బలవంతుడికి ఒక న్యాయం – బలహీనుడికి ఒక న్యాయం’ అనే వివక్ష కనిపిస్తే ఈ ఉత్తర్వుల పరమార్థం నీరుగారిపోతుంది. జరిమానాల వసూలు మాత్రమే ధ్యేయంగా కాకుండా, పౌర బాధ్యతను పెంపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి. డిజిటల్ విప్లవం ద్వారా వాహన యజమాని సమగ్ర వివరాలను క్షణాల్లో తెలుసుకునే సాంకేతికత అందుబాటులో ఉన్న నేటి కాలంలో, నంబర్ ప్లేట్లపై హోదాల అవసరం ఏమాత్రం లేదు. చట్టసభల్లో చట్టాలు చేసేవారే వాటిని శిరసావహిస్తే, సామాన్య ప్రజలు వాటిని అనుసరించడానికి ఎటువంటి సంకోచం చూపరు. అప్పుడే తెలంగాణ రహదారులు హోదాల హంగామా నుండి విముక్తి పొంది, చట్టబద్ధమైన పాలనకు నిదర్శనంగా నిలుస్తాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.