మహా పూజతో నాగోబా జాతర ప్రారంభం

– వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీలు
– ఎంపీ నగేశ్ పూజలు

ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి మహాపూజతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంప్రదాయ రీతిలో సన్నాయి మోతలు, డోలు వాయిద్యాలు, దివిటీల కాంతుల మధ్య మెస్రం వంశీయులు నాగోబాను గంగా జలంతో అభిషేకిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎంపీ జి.నగేశ్ నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ గోండు పద్దతిలో ఆయన పూజలు నిర్వంచారు. జాతర సందర్భంగా పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు. దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. నాగోబా జాతర ఆసియాలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచింది. పుష్యమాసంలో నెలవంక కనిపించిన అనంతరం మెస్రం వంశీయులు.. ఈ నాగోబా జాతరకు శ్రీకారం చుడతారు. డిసెంబర్ 30న మెస్రం వంశీయులు కేస్లాపూర్ నుంచి పాదయాత్రగా హస్తినమడుగుకు చేరుకొని అక్కడ సేకరించిన పవిత్ర గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్నారు. ఆ గంగాజలంతో ఆదివారం అర్ధరాత్రి ఆదిశేషుడికి అభిషేకం చేసి మహాపూజలు నిర్వహించడం ద్వారా ఈ జాతరను ప్రారంభించారు. జాతర ఈనెల 23వ తేదీ వరకూ కొనసాగనుంది. ఈ జాతరలో భాగంగా 20న పెర్సపేన్, బాన్ పేన్ పూజలు, 22న నాగోబా దర్బార్ నిర్వహించనున్నారు. 23న బేతాల్ పూజ, మండగా జాలింగ్ పూజలతో నాగోబా జాతర ముగియనుంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక సరిహద్దు రాష్ట్రాల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు భారీగా తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *