– 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న జలాశయం
– రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను ఆధునికీకరిస్తాం
– ప్రాజెక్టుల్లో పేరుకున్న పూడికను తొలగిస్తాం
– మంత్రి అడ్లూరితో కలిసి సాగర్ గేట్లు ఎత్తిన మంత్రి ఉత్తమ్
నాగార్జునసాగర్, ప్రజాతంత్ర, జూలై 29: ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఒక ఆధునిక దేవాలయమని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను ఆధునికీకరిస్తామని, అలాగే పూడిక తీస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి, నల్గొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లను మంగళవారం ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ సాగర్ గేట్లు ఎత్తి నీటిని వదలడం చాలా సంతోషంగా ఉందన్నారు. 18 ఏళ్ల తర్వాత జులైలోనే నాగార్జునసాగర్ జలాశయం నిండిరదని తెలిపారు. 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించిన గొప్ప ప్రాజెక్టు ఇది అని కొనియాడారు. సాగర్ కాల్వల ద్వారా రెండు రాష్ట్రాల్లోని ప్రతీ ఎకరాకు నీరు చేరిందని, మన రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి పండిరదని ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని 22 లక్షల ఎకరాలకు నీరు అందుతోందని చెప్పారు. జవహర్ కుడి కాల్వ ద్వారా 11.74 లక్షల ఎకరాలు, లాల్‌బహదూర్ ఎడమ కాల్వ ద్వారా 10.38 లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నట్లు వెల్లడిరచారు. తెలంగాణలో మొత్తం 6 లక్షల 50వేల ఎకరాలకు నీరు అందుతుండగా, నల్గొండ జిల్లాలో 1,50,000 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 2 లక్షల 30 వేల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్ష ఎకరాలకు ఆయకట్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా నీరందుతున్నదని తెలిపారు. 2005లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్వర్ణోత్సవాలు నిర్వహించినట్లు చెప్పారు. తను ఆరుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టు మంత్రిగా నాగార్జున సాగర్ ద్వారా నీటిని వదలడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత వానాకాలం, యాసంగి, వానాకాలం కలిసి రెండు లక్షల 81 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని, ఇందులో సాగర్ ప్రాజెక్టు పాత్ర ముఖ్యమని అన్నారు. సాగునీటితోపాటు నాగార్జునసాగర్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా నాలుగు రోజులుగా 30వేల క్యూసెక్కుల నీటితో పూర్తిస్థాయిలో, 700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామన్నారు. నాగార్జునసాగర్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డిఎస్ చౌహన్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ అజయ్‌కుమార్, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎస్‌ఈ మల్లికార్జునరావు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. కాగా, సాగర్ ప్రాజక్ట్ ద్వారా మంత్రులు 6 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలిన తర్వాత అధికారులు 14 గేట్ల ద్వారా 10932 క్యూసెక్కుల నీటిని వదిలారు. సాయంత్రం వరకు 20 గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదలనున్నట్లు ప్రాజక్ట్ అధికారులు తెలిపారు. అనంతరం మంత్రులు,అ ధికారులు సాగర్ ఎడమ కాల్వను సందర్శించి కృష్ణా జలాలకు పుష్పాభిషేకం చేశారు.


