నాగార్జున పాఠశాలలో ఘ‌నంగా అక్షరాభ్యాస మహోత్సవం

చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన కరస్పాండెంట్ డాక్టర్ నాగరాజు

రామన్నపేట, ప్రజాతంత్ర జనవరి 23 : విద్యకు అధిదేవత అయిన చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినాన్ని పురస్కరించుకుని, స్థానిక నాగార్జున పాఠశాలలో వసంత పంచమి వేడుకలను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

శాస్త్రోక్తంగా సరస్వతీ పూజ :
వేడుకల్లో భాగంగా పాఠశాల యాజమాన్యం సరస్వతీ దేవి పూజా కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించింది. పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ నాగరాజు నకిరేకంటి స్వయంగా చిన్నారులకు ఓనమాలు దిద్దించి, వారి విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయించడం శుభసూచకమని భావించిన తల్లిదండ్రులు తమ పిల్లలతో ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

చదువే అసలైన ఆస్తి: డాక్టర్ నాగరాజు

ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ.. “తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఇచ్చే గొప్ప ఆస్తి కేవలం విద్య మాత్రమే. సంపద కరిగిపోవచ్చు కానీ, జ్ఞానం ఎప్పటికీ తరగదు” అని పేర్కొన్నారు. పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తల్లిదండ్రులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రేఖ.ఎన్, ఉపాధ్యాయులు సంధ్య, అక్రమ్, స్వప్న, విజయ్, శ్రీలత, వినిష తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. వేడుకల అనంతరం విద్యార్థులకు ప్రసాద వితరణ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *